
కేజీబీవీల్లో నాణ్యమైన విద్య
నిర్మల్ రూరల్: కేజీబీవీలో నాణ్యమైన విద్యాబోధనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మండలంలోని అనంతపేట్ కస్తూరిబాగాంధీ పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశారు. స్టోర్‌రూం, వంటగది, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటిస్తూ కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలని సూచించారు. విద్యతోపాటు క్రీడల్లో నైపుణ్యం పెంపొందించేలా పాఠశాల ప్రాంగణంలో బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ కోర్టులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఇన్‌చార్జి డీఈవో పరమేశ్వర్, ఎంఈవో వెంకటేశ్వర్లు, తాహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో గజానన్, కేజీబీవీ ప్రత్యేక అధికారి శ్రీలత, ఉపాధ్యాయులు ఉన్నారు.