
‘పీఎంశ్రీ’ నిధులపై సందేహాలు నివృత్తి చేయాలి
నిర్మల్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం అమలుచేస్తోంది. ఎంపిక చేసి న పాఠశాలలకు భారీగా నిధులు ఇస్తోంది. అయితే ఈ నిధుల వినియోగంలో గందరగోళం నెలకొందని తపస్ జిల్లా ఇన్‌చార్జి శశిరాజ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం మాట్లాడారు. పీఎంశ్రీకి జిల్లాలో మొత్తం 82 పాఠశాలల్లో ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రతీ పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల చొప్పున విడుదల చేసిందని పేర్కొన్నారు. అయితే ఈ నిధుల విడుదల, వాటి పంపిణీ విషయంలో ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. డీఈవో పారదర్శకంగా వ్యవహరించి, స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే విద్యాశాఖపై విశ్వాసం ఏర్పడి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయన్నారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖ సమన్వయంతో పనిచేసి జిల్లా విద్యారంగాన్ని పరిరక్షించాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్‌కుమార్, సుదర్శన్, రాజేశ్వర్, ఆర్.రాజేశ్వర్ పాల్గొన్నారు.