
భైంసాలో బెట్టింగ్ మాఫియా
భైంసాటౌన్: భైంసా పట్టణంలో బెట్టింగ్ మాఫియా గుట్టు రట్టయింది. అక్రమ లావాదేవీలతో కోట్ల రూపాయలు గడించింది ఈ మాఫియా. అమాయకులకు డబ్బు ఆశ చూపి, వారి పేరిట బ్యాంకు ఖాతాలను తెరిపించి, నెలకు కొంత మొత్తం చెల్లిస్తూ వాటిని ఈ ముఠానే నిర్వహిస్తోంది. ఈ ఖాతాల ద్వారా లక్షల రూపాయల లావాదేవీలు జరుపుతూ, ఖాతాదారులకు తెలియకుండానే అక్రమ కార్యకలాపాలు నడుపుతున్నారు. అధిక మొత్తంలో లావాదేవీలు జరగడంతో ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేయడంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. మోసపోయిన వారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
బెట్టింగ్ బుకీల అడ్డా..
భైంసా పట్టణం బెట్టింగ్ బుకీలకు అడ్డాగా మారింది. ఓ మాజీ కౌన్సిలర్ సుదీర్ఘకాలంగా ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి గతంలో అరెస్ట్ చేశారు. భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఓవైసీనగర్‌లో బెట్టింగ్ బుకీ సయ్యద్ అజామ్ నివాసంపై పోలీసులు దాడిచేశారు. అజామ్ మీసేవా కేంద్రం, బ్యాంక్ సర్వీస్ పాయింట్ నిర్వహిస్తూనే బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించారు. అతని నుంచి రూ.కోటిన్నర విలువైన నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు ఈ దందాలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మ్యూల్ ఖాతాలతో లావాదేవీలు..
బెట్టింగ్ నిర్వాహకులు ‘ఆల్ ప్యానల్స్’ అనే వెబ్‌సైట్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓవైసీనగర్‌లో మీసేవా కేంద్రం నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఈ దందాకు కేంద్రంగా వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యక్తులు అమాయకులకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు చెల్లిస్తూ వారి బ్యాంకు ఖాతాలను వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ తీసుకుని, ఖాతాదారులకు తెలియకుండా రూ.లక్షల్లో లావాదేవీలు జరుపుతున్నారు. ఈ ఖాతాల్లో అధిక మొత్తంలో నగదు లావాదేవీలు జరగడంతో ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేస్తోంది. దీంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. బెట్టింగ్ బుకీలు ఆదాయపన్ను శాఖను కూడా తప్పుడు పత్రాలతో మభ్యపెడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. కొందరికి చెల్లింపులు చేయకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గతంలో గణేశ్‌నగర్‌కు చెందిన షిందే ప్రవీణ్ అనే యువకుడిని క్రికెట్ బెట్టింగ్, మ్యూల్ ఖాతాల సమకూర్పులో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు.
నిఘా వైఫల్యం..
అక్రమ దందాలను అరికట్టే బాధ్యత పోలీసులతోపాటు నిఘా విభాగాలపై ఉంది. అయితే, భైంసాలో ఇటువంటి కార్యకలాపాలు వెలుగులోకి రావడం నిఘా విభాగాల వైఫల్యంగా విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జరిగే కార్యకలాపాలపై నిఘా విభాగాలకు సమాచారం ఉన్నప్పటికీ, వాటిని ఉన్నతాధికారులకు చేరవేయకపోవడంతో నేరాలను నియంత్రించలేకపోతున్నారని ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగ్‌తోపాటు మట్కా, గుట్కా, గంజాయి అక్రమ రవాణా వంటి దందాలు రహస్యంగా జరుగుతున్నప్పటికీ, వీటిని పూర్తిగా నియంత్రించలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.
చర్యలు తీసుకుంటాం...
అక్రమదందాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. బెట్టింగ్ దందాపై ప్రత్యేక నిఘా ఉంచాం. ఈ కేసులో ఇదివరకే 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం. తాజాగా, ఓవైసీనగర్‌కు చెందిన సయ్యద్ అజామ్ అనే బుకీని అరెస్ట్ చేశాం. జూదం, బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తాం.
– అవినాష్‌కుమార్, ఏఎస్పీ, భైంసా