
పాఠశాలలకు ‘పది’ మెమోలు
లక్ష్మణచాంద: సెకండరీ బోర్డు 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల విధానంలో కీలక మార్పులు చేపట్టింది. గతంలో ఉన్న గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) విధానాన్ని తొలగించి, సబ్జెక్టుల వారీగా మార్కులతో కూడిన ఫలితాలను ప్రకటించింది. ఈ మార్పులు విద్యార్థులకు స్పష్టమైన మార్కుల వివరాలను అందించినప్పటికీ, కొన్ని సమస్యలను కూడా తెచ్చిపెట్టాయి.
ఫలితాలు, మెమోలు ఆలస్యం..
పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించారు. ఏప్రిల్ 7 నుంచి 15 వరకు మూల్యాంకనం జరిగింది. ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదలయ్యాయి. అయితే, ఫలితాల ప్రకటన తర్వాత విద్యార్థులు మార్కుల మెమోల కోసం 100 రోజులకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది. సెకండరీ బోర్డు అధికారులు స్పీడ్ పోస్ట్ ద్వారా మెమోలను పాఠశాలలకు పంపగా, రెండు రోజుల క్రితం అవి చేరాయని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
కొత్త మార్కుల విధానం..
గతంలో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా గ్రేడ్ పాయింట్లు ఇచ్చి, వాటిని కలిపి మొత్తం జీపీఏ ప్రకటించేవారు. కానీ, కొత్త విధానంలో ఇంటర్నల్(20 మార్కులు), ఎక్స్‌టర్నల్ (80 మార్కులు) మార్కులను విడివిడిగా చూపిస్తూ, సబ్జెక్టు వారీగా గ్రేడ్ పాయింట్‌తోపాటు ‘పాస్’ అని మాత్రమే మెమోలో సూచిస్తున్నారు. అయితే, విద్యార్థి సాధించిన మొత్తం మార్కుల సమగ్ర వివరాలు మెమోలో లేకపోవడంతో, సబ్జెక్టుల వారీ మార్కులను కలిపి లెక్కించుకోవాల్సిన పరిస్థితి.
కొత్త విధానంపై విమర్శలు..
కొత్త మార్కుల విధానం విద్యార్థుల మధ్య పోటీతత్వాన్ని పెంచుతోందని, ఇది విద్యార్థుల మానసిక ఒత్తిడిని పెంచవచ్చని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు ఈ విధానాన్ని ఆసరాగా చేసుకుని, తమ విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించారని ప్రచారం చేస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. గత జీపీఏ విధానంలో మార్కుల బేధాలు స్పష్టంగా తెలియకపోవడంతో విద్యార్థుల మధ్య పోటీ తక్కువగా ఉండేదని, అదే విద్యార్థులకు అనువైనదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
విద్యార్థులు తీసుకెళ్లాలి
పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల మెమోలు గురువారం పాఠశాలకు వచ్చాయి. విద్యార్థులు పాఠశాల సమయంలో వచ్చి తమ మార్కుల మెమోలు తీసుకెళ్లాలి.
– రాజు నాయక్, ప్రధానోపాధ్యాయుడు,
లక్ష్మణచాంద ఉన్నత పాఠశాల

పాఠశాలలకు ‘పది’ మెమోలు