
విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యం
బాసర: విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అంద రూ విధులు నిర్వహించాలని ఆర్జీయూకేటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి సూచించారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్, వివిధ విభాగాధిపతులతో కలిసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్య కార్యక్రమాలు, విద్యార్థుల తరగతులు, ల్యాబ్‌లు, సెమినార్లు, ప్రాజెక్టులు రాబోయే విద్యా ప్రణాళికలపై చర్చించారు. క్యాంపస్ సౌకర్యాలు, వసతి గృహాల్లో వాతావరణం, ఆహార వసతులు, శుభ్రత, ఆరోగ్య సౌకర్యాలు లైబ్రరీ, క్రీడా తదితర సదుపాయాలపై సమీక్ష చేశారు. ప్రతీ విభాగాధిపతి, సెక్షన్ హెడ్, అధ్యాపకులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే క్యాంపస్‌లో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని గోవర్ధన్ అన్నారు. మెంటరింగ్ సిస్టమ్, కౌన్సిలింగ్, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, పరిశోధన అవకాశాలు, పరిశ్రమలతో అనుసంధానం వంటి అంశాలను బలోపేతం చేయాలని సూచించారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సృజనాత్మక అభివృద్ధి కలిగించే వాతావరణాన్ని కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ట్రిపుల్ ఐటీలో ఎలక్ట్రిక్ వాహనాలపై శిక్షణ
ఆర్జీయూకేటీలో ఎలక్ట్రిక్ వాహనాలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం, నమ్యాట్ ఫేస్–3, తిరువనంతపురంలోని సీడీఏసీ (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్), భారత ప్రభుత్వ మెయిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్ కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. వాహన భాగాలను విడదీసి అమర్చడం, పరీక్షించడంపై విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నవీన్ కుమార్, రెంజి వీ.చాకో, రామ్‌గోపాల్‌గుప్తా నేతృత్వంలో కార్యక్రమం ప్రారంభమైందన్నారు. పవర్ ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, భవిష్యత్ సాంకేతికతలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ శిక్షణ విద్యార్థుల పరిశోధన, ప్రాజెక్టు ఆవిష్కరణలకు దోహదపడుతుందని, ఎలక్ట్రిక్ వాహన రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.