
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ఖానాపూర్/భైంసాటౌన్: ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఆసరా పెన్షన్లతోపాటు దివ్యాంగ పెన్షన్ల పెంచుతామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ విమర్శించారు. నిలదీయాల్సిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మిన్నకుండిపోయిందని పేర్కొన్నారు. ఖానాపూర్, భైంసాలో శుక్రవారం వేర్వేరుగా నిర్వహించిన మహాగర్జన సన్నాహక సదస్సులకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అధికార, ప్రతిపక్షాల నిర్లక్ష్యం కారణంగానే పింఛన్లు పెరగడం లేదన్నారు. వారి బాధ్యతారాహిత్యాన్ని గుర్తు చేయడానికే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో నిర్వహించే మహాగర్జన సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పి.రామారావు పటేల్, ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు అంబేకర్ సాయినాథ్, బిక్కి మురళికృష్ణ, ప్రణీత్, రేణికుంట్ల సాగర్, శనిగారపు రవి, లక్ష్మణ్, శంకర్, రహీం, వకీల్, లక్ష్మి, సాజిద్, ముస్తాక్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం వినతి
కుంటాల: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మండలంలోని కల్లూరు వాసవి కళాశాలలో ప్రతినిధులు మందకృష్ణ మాదిగకు వినతిపత్రం అందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మందకృష్ణను సన్మానించారు. వినతిపత్రం ఇచ్చినవారిలో జెడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, టీపీడీఎంఏ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం ఎగ్జిక్యూటివ్ స్టేట్ మెంబర్ బోయ సాయిలు, ప్రిన్సిపాళ్లు గట్టుపల్లి శ్రీనివాస్, సంతోష్ ఉన్నారు.