
గ్రామాల్లో పనుల జాతర
లక్ష్మణచాంద: జిల్లా వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అంకితభావంతో ప్రజలను భాగస్వామ్యం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద కూలీ కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచడం, ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల కూలీ పని దినాలను కల్పించడం ఉపాధి హామీ పథకం ప్రధాన లక్ష్యం.
చేపట్టే పనులు..
కొత్త నిర్మాణాలకు శంకుస్థాపన
2025–26 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ప్లాస్టిక్ నెస్ట్ యూనిట్, సెగ్రిగేషన్ షెడ్, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణంతోపాటు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల ద్వారా గ్రామీణ రహదారుల నిర్మాణం వంటి కొత్త పనులకు శంకుస్థాపనలు చేస్తారు.
పూర్తయిన పనుల ప్రారంభోత్సవం
ఇప్పటికే పూర్తయిన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామీణ రహదారులు, సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేస్తారు.
ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా
స్వయం సహాయక సంఘం మహిళలకు పశువుల కొట్టాలు, కోళ్ల షెడ్లు, గొర్రెల షెడ్లు, కొత్త వ్యవసాయ బోరు బావులు, పండ్ల తోటల పెంపకం, వానపాముల ఎరువు తయారీ, అజోలా ఫీడ్ నిర్మాణం వంటి జీవనోపాధి అభివృద్ధి పనులకు మంజూరు ఉత్తర్వులను లబ్ధిదారులకు అందిస్తారు.
వ్యక్తిగత లబ్ధిదారుల పనులు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతీ గ్రామంలో వ్యక్తిగత లబ్ధిదారులకు చెందిన కనీసం ఒక పనికి శంకుస్థాపన చేస్తారు.
ఫల వనాలు, వన మహోత్సవం...
ఈత మొక్కలు, తాటి చెట్లు, పండ్ల తోటల పెంపకం వంటి పనులకు మంజూరు ఉత్తర్వులను లబ్ధిదారులకు అందిస్తారు.
జల నిధి పథకం..
నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంచే పనులు చేపట్టిన లబ్ధిదారులను గుర్తించి సన్మానిస్తారు.
దివ్యాంగుల సన్మానం
గత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ పని రోజులు చేసిన దివ్యాంగుల కుటుంబాలను గుర్తించి ఘనంగా సన్మానిస్తారు.
పచ్ఛదనం పెంపకం..
గ్రామంలో స్వచ్ఛందంగా చెట్ల పెంపకంలో పాల్గొని, ఇతరుల భాగస్వామ్యంతో పచ్ఛదనాన్ని పెంచడానికి తోడ్పడిన వ్యక్తులు/కుటుంబాలను సన్మానిస్తారు.
కడెంలో ప్రారంభం
‘పనుల జాతర–2025’ కార్యక్రమం ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం మండలం, ధర్మాజీపేట్ గ్రామంలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ పాల్గొననున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొంటారు.
పకడ్బందీగా అమలు..
పనుల జాతర 2025 కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. గ్రామీణ నిరుపేద కుటుంబాలకు మరింత మెరుగైన పనులను కల్పించడం, సంవత్సరం పొడుగునా పని కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడం కార్యక్రమం లక్ష్యం. – విజయలక్ష్మి, డీఆర్డీవో

విజయలక్ష్మి, డీఆర్డీవో