
ఎఫ్‌ఆర్‌ఎస్‌తో పెరిగిన హాజరు
లక్ష్మణచాంద: పాఠశాల విద్యాశాఖ ఈ నెల 1 నుంచి అమలు చేస్తున్న ముఖ గుర్తింపు హాజరు నమోదు (ఎఫ్‌ఆర్‌ఎస్) విధానం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు పారదర్శకతను మెరుగుపరిచింది. ఈ విధానం ద్వారా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు తమ హాజరును క్రమం తప్పకుండా నమోదు చేసుకుంటున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో 19 మండలాల పరిధిలో మొత్తం 711 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 3,110 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, వీరిలో 3,079 మంది ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదు చేసుకున్నారు. గురువారం 2,655మంది ఉపాధ్యాయులు హాజరు కాగా, 74 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 378 మంది సెలవులో ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ గణాంకాలు ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదులో పారదర్శకతను సూచిస్తున్నాయి.
గైర్హాజరీకి చెక్
గతంలో కొంతమంది ఉపాధ్యాయులు పాఠశాలల కు హాజరు కాకుండా, రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లి పోయేవారు. కొందరు ప్రైవేట్ పాఠశాల నిర్వహణ, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ వ్యాపారాలు చేసుకునేవారు. ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం ఈ అనవసర గైర్హాజరీని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విధానం పాఠశాలకు 100 మీటర్ల పరిధిలోనే పనిచేస్తుంది. దీంతో ఉపాధ్యాయులు తమ హాజరును నమోదు చేయడానికి తప్పనిసరిగా పాఠశాలకు రావాల్సి ఉంటుంది. ఈ విధానం ఉదయం హాజరు నమోదు, సాయంత్రం విధుల ముగింపు సమయంలో రెండుసార్లు అమలవుతుంది, ఇది ఉపాధ్యాయుల బాధ్యతను మరింత పెంచింది.
పర్యవేక్షణ, పారదర్శకత
ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం అమలును పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులు(డీఈవో), మండల విద్యాశాఖ అధికారులు(ఎంఈవో) పర్యవేక్షిస్తున్నారు. ఈ పర్యవేక్షణతో హాజరు నమోదు ప్రక్రియలో పారదర్శకత గణనీయంగా మెరుగుపడింది. ఈ విధానం ఉపాధ్యాయులు పాఠశాలల్లో క్రమం తప్పకుండా హాజరయ్యేలా చేయడమే కాక, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కూడా దోహదపడుతోంది.
ఉత్తమ ఫలితాలు
పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులకు ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు హాజరు నమోదు జిల్లాలో ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. పాధ్యాయులందరూ సకాలంలో పాఠశాలలకు చేరుకుని సాయంత్రం వరకు ఉండి హాజరు నమోదు చేసుకుంటున్నారు. దీంత అనధికార డుమ్మాలకు చెక్ పడింది.
– రామారావు, డీఈవో
హాజరు నమోదు శాతం 85.78
లీవ్‌లో ఉన్న
ఉపాధ్యాయులు 378
గురువారం హాజరైన ఉపాధ్యాయులు 2,655
గైర్హాజరైన
ఉపాద్యాయులు 74

ఎఫ్‌ఆర్‌ఎస్‌తో పెరిగిన హాజరు