
అరచేతిలోనే పల్లె పద్దు
నిర్మల్‌ఖిల్లా: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో గ్రామాలకు ఆర్థికసంఘం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విడుదలైన నిధులు, పథకాల వారీగా వ్యయం వివరాలను ప్రజల ముంగిటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా ‘మేరీపంచాయత్’ పేరిట ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగే పనులను అడ్డుకునేలా చొరవ చూపింది. ఈ యాప్ ద్వారా పంచాయతీ సమగ్ర సమాచారం తెలుసుకునే మార్గాన్ని సులభతరం చేసింది. యాప్ లో ప్రతీ లెక్క పక్కాగా పొందుపరిచి ఉంటుంది.
తప్పుడు గణాంకాలు లేకుండా..
గ్రామపంచాయతీ నిధులు, చేపట్టిన పనుల వివరాలు.. వార్డులవారీగా ఫొటోలతో సహా ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆర్థిక సంఘం ఎన్ని నిధులు విడుదల చేసింది.. ఇంకా ఎన్ని నిధులు రావాల్సి ఉంది.. ఇందులో తెలిసిపోతుంది. గ్రామపంచాయతీ పాలకవర్గాలు కూడా పొరపాట్లకు తావివ్వకుండా ప్రతీ పైసాను లెక్క ప్రకారం ఖర్చు చేసే అవకాశముంటుంది. పంచాయతీ కార్యదర్శి నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల వరకు ఎవరు తప్పుడు నివేదికలు చూపినా పౌరులు ప్రశ్నించి సమాచారాన్ని రాబట్టవచ్చు.
ఎలా లాగిన్ అవ్వాలంటే..
ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో ప్లేస్టోర్‌లో ‘మేరీపంచాయత్’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానిని ఓపెన్ చేస్తే మొదటి పేజీలో పేరు, మొబైల్ నంబర్ వివరాలతో లాగిన్ కావాలి. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం తదితర వివరాలు నమోదు చే యాలి. వాటిని ఎంపిక చేసుకున్న తర్వాత క్లిక్ చేస్తే ఆ గ్రామానికి సంబంధించిన ఆదాయ, వ్యయాలు, నిధుల పూర్తి సమాచారం వార్డులవారీగా నమోదై ఉంటుంది. జిల్లాలో 19 మండలాలుండగా ఇందులో ఒక అర్బన్ మండలం ఉంది. 18 మండలాల్లోని 400 గ్రామాల పరిధిలో 3,368 వార్డులున్నాయి.
పారదర్శకత కోసమే..
ప్రతీ గ్రామపంచాయతీకి సంబంధించిన అభివృద్ధి పనుల ఆర్థిక పురోగతి, ఆస్తులు జియో ట్యాగింగ్ ద్వారా ఈ యాప్‌లో నిక్షిప్తమై ఉంటాయి. వీటిని పొందుపరచాల్సిన బాధ్యత పంచాయతీరాజ్ శాఖదే. గ్రామపంచాయతీ పాలక వర్గాల పేర్లతో సహా వివరాలు, పంచా యతీ కార్యదర్శి వివరాలు, మంజూరైన నిధులు, ఏయే పనులకు ఎంత వ్యయం చేశారు? ఆ పనుల ప్రస్తుత పురోగతి? తదితర అంశాలూ అందుబాటులో ఉంటాయి. అంచనా వ్యయాలు, అభివృద్ధి పనుల నివేదికలు ఇందులో క్లుప్తంగా పొందుపరిచి ఉంటాయి. జీపీఆర్‌ఎస్ ద్వారా గుర్తించడంతో ఒకసారి చేసిన పనులకు మరోసారి బడ్జెట్ కేటాయించడానికి అవకాశం ఉండదు. తద్వారా నిధుల వినియోగంలో పారదర్శకత ఎక్కువగా ఉంటుంది.