
రాకున్నా.. వచ్చినట్టు..
● పంచాయతీ కార్యదర్శుల తప్పుడు హాజరు నమోదు ● విధులకు రాకుండానే ఫొటోలు అప్‌లోడ్ ● జిల్లాలో ఐదుగురు సస్పెన్షన్, 82 మందికి నోటీసులు
కార్యదర్శుల కనికట్టు
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పరిపాలన గాడి తప్పుతుందనే ఆరోపణలు వెలువడుతున్నాయి. కొందరు పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరు కాకుండా, రోజువారీ శానిటేషన్ రిపోర్ట్(డీఎస్‌ఆర్) యాప్‌లో తప్పుడు ఫొటోలు అప్‌లోడ్ చేస్తూ పారిశుద్ధ్య నివేదికలను నకిలీ చేస్తున్నారు. జిల్లాలో జరిపిన తనిఖీల్లో 87 మంది కార్యదర్శులు ఈ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించడంతో, ఉన్నతాధికారులు చార్జ్ మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఐదుగురిని సస్పెండ్ చేశారు.
పారిశుద్ధ్య కార్మికుల ఫోన్ల దుర్వినియోగం..
కొందరు కార్యదర్శులు పారిశుద్ధ్య కార్మికుల సెల్‌ఫోన్‌లలో డీఎస్‌ఆర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, వారి ద్వారా తమ హాజరును నమోదు చేయిస్తున్నారు. ఈ విధానం ద్వారా విధులకు హాజరు కాకుండానే నివేదికలను నకిలీ చేస్తున్నారు. ఈ అవకతవకలు యాప్‌లోని సాంకేతిక లోపాలు, అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం వల్ల సాధ్యమవుతున్నాయి.
పర్యవేక్షణలో లోపం...
పంచాయతీ కార్యదర్శుల పనితీరును పర్యవేక్షించే బాధ్యత మండల పంచాయతీ అధికారుల(ఎంపీవో లు), డీఎల్‌పీవోలు, డీపీవోలది. కార్యదర్శుల హాజ రు నమోదు ఎంపీవో లాగిన్‌లో ఉంటుంది. దీనిని ఉన్నతాధికారులు తనిఖీ చేయవచ్చు. అయినా అ ధికారుల నిర్లక్ష్యం కారణంగా కార్యదర్శులు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తూ, తప్పుడు నివేదికలను సమర్పిస్తున్నారు. ఈ లోపం గ్రామీణ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించడానికి ని దర్శ నం. మరోవైపు డీఎస్‌ఆర్ యాప్‌లో సెల్ఫీతో పాటు ఏ ఫొటో అప్‌లోడ్ చేసినా ఆమోదం పొందే సాంకేతిక లోపం కార్యదర్శులకు అనుకూలంగా మారింది. ఈ లోపాన్ని సవరించకపోవడం, అధికా రులు కఠినంగా పర్యవేక్షించకపోవడం వల్ల గ్రామ పంచా యతీల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ, నివేది కల సమర్పణలో అవకతవకలు కొనసాగుతున్నా యి.
నోటీసులు జారీ చేశాం..
డీఎస్‌ఆర్ యాప్‌లో తప్పుడు ఫొటోలు నమోదు చేసిన 82 మంది కార్యదర్శులను గుర్తించి నోటీసులు, ఐదుగురు కార్యదర్శులను సస్పెండ్ చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి. సెలవు పెట్టకుండానే విధులకు గైర్హాజరయ్యే కార్యదర్శులపై చర్యలు తప్పవు.
– శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి
సస్పెన్షన్, నోటీసులు..
జిల్లాలో 400 గ్రామ పంచాయతీల్లో 384 మంది కార్యదర్శులు (గ్రేడ్–1 నుంచి గ్రేడ్–4, జూనియర్, ఔట్‌సోర్సింగ్) విధులు నిర్వహిస్తున్నారు. మొదట్లో కార్యదర్శులు ఉదయం 9 గంటలకే గ్రామాలకు చేరుకొని హాజరు నమోదు చేసేవారు. అయితే, కొందరు కార్యదర్శులకు ఒకటి కంటే ఎక్కువ పంచాయతీల బాధ్యతలు ఉండటంతో సమయం సరిపోవడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఉదయం 11 గంటల వరకు సమయ సడలింపు ఇచ్చారు. అయినా కొందరు ఈ సడలింపును దుర్వినియోగం చేస్తూ, విధులకు హాజరు కాకుండా తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారు. జూలైలో రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో 87 మంది కార్యదర్శులు తప్పుడు ఫొటోలు అప్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. దీంతో, కలెక్టర్ ఆదేశాల మేరకు 82 మంది గ్రేడ్–3, 4 కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఐదుగురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
డీఎస్‌ఆర్ యాప్‌లో తప్పుడు నివేదికలు
పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ ఉదయం 11 గంటలలోపు గ్రామ పంచాయతీలో హాజరై, డీఎస్‌ఆర్ యాప్‌లో సెల్ఫీ ఫొటో అప్‌లోడ్ చేసి, పారిశుద్ధ్య పనుల ఫొటోలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సెల్ఫీ ఫొటో వారి ముఖ గుర్తింపు హాజరుగా పరిగణించబడుతుంది. అయితే, కొందరు కార్యదర్శులు విధులకు హాజరు కాకుండా, యాప్‌లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని తప్పుడు ఫొటోలు అప్‌లోడ్ చేస్తున్నారు. పంచాయతీ భవనాలు, కుర్చీలు, ఇతర వస్తువుల ఫొటోలను లేదా కార్యదర్శుల సెల్ఫీలను మరో ఫోన్ ద్వారా తీసి నమోదు చేస్తున్నారు.

రాకున్నా.. వచ్చినట్టు..