
కని పారేయకండి..
● ‘ఊయల’లో వేయండి..!
● అనాథ శిశువుల కోసం కలెక్టర్ వినూత్న ఆలోచన
● భైంసా ఏరియాస్పత్రిలో ప్రారంభం
భైంసాటౌన్: నవ మాసాలు తన గర్భంలో మోసిన తల్లి కర్కశంగా వ్యవహరిస్తోంది. తన ఒడిలో వెచ్చగా సేదదీరాల్సిన శిశువును చెత్త కుప్పల్లో, మురికికాలువలో పారవేస్తోంది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసిబిడ్డలు లోకం చూడకుండానే ఊపిరి వదులుతున్నారు. భైంసా పట్టణం నడిబొడ్డున.. నిత్యం జనసంచారం ఉండే ప్రదేశంలో ఓ మృత శిశువును రెండు రోజుల క్రితం డ్రెయినేజీలో పడేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్ వినూత్న ఆలోచన చేశారు. ఈ మేరకు ఊయల పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్రమ సంబంధాలు, పెళ్లికి ముందే గర్భం దాల్చడం, వారసుడి కోసం వరుసగా గర్భం దాల్చడం, ఆడపిల్ల పుడితే వదిలించుకోవడం చేస్తున్నారు. కొందరు గర్భంలోనే చిదిమేస్తుండగా, మరికొందరు పుట్టిన తరువాత తుప్పల్లో పడేస్తూ వదిలించుకుంటున్నారు. ఇలాంటి అమానవీయ ఘటనలు జరగడం కలవరపాటుకు గురి చేస్తోంది.
‘ఊయల’కు శ్రీకారం..
భైంసా పట్టణంలో జరిగిన అమానవీయ ఘటనలు పునరావృతం కాకూదన్న ఉద్దేశంతో ‘ఊయల’ అనే వినూత్న కార్యక్రమానికి కలెక్టర్ రూపకల్పన చేశారు. వెంటనే అమలు చేయాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశించారు. దీంతో శుక్రవారం డీఎంహెచ్‌వో రాజేందర్, డీసీహెచ్‌ఎస్ సురేశ్ భైంసాకు చేరుకుని, మృత శిశువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏరియాస్పత్రిలో ఊయల కార్యక్రమం ప్రారంభించారు. అప్పుడే పుట్టిన పసిబిడ్డలను వద్దనుకునేవారు చెత్త కుప్పల్లో, మురికి కాలువల్లో వేయవద్దని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఊయలలో వేయాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంటాయ ని, ఎలాంటి కేసులు ఉండవని భరోసా ఇస్తున్నారు. వారి అనుమతి మేరకు శిశువులను బాలల సంరక్షణ అధికారులకు అప్పగిస్తామని పేర్కొన్నారు.
ఊయలలో వేయాలి..
కనిపారేసే శిశువుల సంరక్షణ కోసం కలెక్టర్ ఆదేశాల మేరకు ఊయల కార్యక్రమం ప్రారంభించాం. భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిలో ఊయల ఏర్పాటు చేశాం. అప్పుడే పుట్టిన తమ శిశువులను వద్దనుకునే తల్లిదండ్రులు ఏరియాస్పత్రిలోని ఊయలలో వేయవచ్చు.
– రాజేందర్, డీఎంహెచ్‌వో, నిర్మల్