
ట్రిపుల్ ఐటీ అధ్యాపకులకు శిక్షణ
● బోధనా నైపుణ్యాల అభివృద్ధికి కొత్త దిశ
బాసర: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) బాసరలో అధ్యాపకుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు గురువారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ‘‘బ్రెయిన్ అండ్ మైండ్ మెమరీ ప్రాసెస్’’ అనే అంశంపై విశ్లేషణాత్మక చర్చలతో జరిగింది. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై అధ్యాపకుల ఆధునిక బోధన పాత్రపై కీలక విషయాలను వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమాలు అధ్యాపకులను సాంకేతికంగా, ఆలోచనాపరంగా అభివృద్ధి చేస్తాయని తెలిపారు. ‘‘అధ్యాపకులు తమ బోధనా విధానాలను ఆధునికీకరించినప్పుడే విద్యార్థులకు ప్రభావవంతమైన అభ్యాసం సాధ్యమవుతుంది. అధ్యాపకుల ప్రవర్తన, ఉపన్యాస శైలి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు విద్యార్థుల అభ్యాస లక్ష్యాలను నేరుగా ప్రభావితం చేస్తాయి’’ అని ఆయన స్పష్టం చేశారు. అధ్యాపకుల బోధనా శైలి, కమ్యూనికేషన్ స్పష్టత విద్యార్థుల అర్థగ్రహణ సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయని ఈ కార్యక్రమంలో వివరించారు. స్పష్టమైన భాష, సమర్థవంతమైన కమ్యూనికేషన్ విద్యార్థులలో జ్ఞాన గ్రహణాన్ని, ఆసక్తిని పెంచుతాయని నొక్కి చెప్పారు.
శిక్షణలో చర్చించిన కీలక అంశాలు
కౌన్సెలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ శిక్షణలో శ్రద్ధ, అవగాహన, జ్ఞాపకశక్తి అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించామని తెలిపారు. అధ్యాపకులు విద్యార్థులలో జ్ఞాపకశక్తిని, అభ్యాస సామర్థ్యాన్ని పెంచేందుకు మైండ్ మ్యాపింగ్, స్వీయ విశ్లేషణ, పరిశీలన, ఫలితాల మౌలిక అంచనా, గుర్తుచేసుకోవడం వంటి టెక్నిక్‌లను ఉపయోగించడంపై శిక్షణ ఇచ్చారు. ఈ టెక్నిక్‌లు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మరింత ఆకర్షణీయంగా, సమర్థవంతంగా మార్చగలవని వివరించారు. అధ్యాపకులు విద్యార్థులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం, వారి అభ్యాస పరిస్థితులను అర్థం చేసుకోవడం ద్వారా విద్యా ఫలితాలను మెరుగుపరచవచ్చని తెలిపారు. స్కీమా ఫార్మేషన్ ద్వారా విద్యార్థులలో జ్ఞాన నిర్మాణాన్ని సులభతరం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్‌షన్, అసోసియేట్ డీన్స్ విఠల్, చంద్రశేఖర్, అన్ని విభాగాల విభాగాధిపతులు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.