
తప్పుడు పత్రాలతో ప్లాట్ విక్రయించిన వ్యక్తిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: తప్పుడు పత్రాలు సృష్టించి ప్లాట్ విక్రయించిన పట్టణానికి చెందిన జోగు రుపేందర్‌పై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఆయన కథ నం ప్రకారం.. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన సులిగల్ల సునీత 2013లో రూపేందర్ వద్ద నుంచి రూ.11 లక్షలకు రిక్షా కాలనీలో ఓ ప్లాట్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత సునీత ఆ ప్లా ట్‌ను విద్యానగర్‌కు చెందిన ఉమేశ్‌రెడ్డికి విక్రయించింది. దీంతో కొనుగోలు చేసిన వ్యక్తి ప్లా ట్ వద్దకు వెళ్లగా, ఈ ప్లాట్ తనదని, రిజిస్ట్రేషన్ తన పేరిట ఉందని పత్రాలు చూపించాడు. దీంతో మోసం చేసి వ్యక్తిపై టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఆదివారం సునీత ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.
డబ్బులు తీసుకుని మోసగించిన వ్యక్తిపై..
ప్లాట్ విక్రయించి డబ్బులు తీసుకుని ప్లాట్‌ను చూపించకుండా మోసగించిన పట్టణంలోని అంకోలి రోడ్డు వైపు ఉండే సయ్యద్ షాహిద్ అహ్మద్‌పై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. 2008లో పంజేషా మొహల్లాకు చెందిన విఖార్ అహ్మద్ ఎస్‌ఏ రియల్‌ఎస్టేట్ వ్యాపారి వద్ద రూ.38వేలకు భీంసరి సమీపంలో ప్లాట్ కొనుగోలు చేశాడు. ప్లాట్ చూపించకుండా తిప్పుకుంటున్నాడు. ప్లాట్ వద్దకు వెళ్లి చూడగా, మరో వ్యక్తికి ఆ ప్లాట్‌ను విక్రయించినట్లు తెలిసింది. బాధితుడు మోసపోయాడని తెలుసుకుని ఆదివారం ఫిర్యాదు చేశాడు.
నకిలీ పత్రాలతో మోసగించిన మహిళపై..
ఆదిలాబాద్‌రూరల్: నకిలీ పత్రాలతో మోసగించిన మహిళపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిదర్ తెలిపారు. తన కార్యాలయంలో ఆదివారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బృందావన్ కాలనీకి చెందిన దాసరి జ్యోతి గత మూడేళ్ల గేడం దేవిదాస్ జ్యోత్న్స దంపతులకు ఖానాపూర్ గ్రామ శివారు సర్వే నంబర్ 68/100/2లో 764 నంబర్ గల (30గీ40) సైజు ప్లాటు కొనుగోలు చేయించింది. ఆ తర్వాత రూ.3.30 లక్షలు వసూళ్లు చేసి నకిలీ పత్రాలతో తమను మోసగించిన దాసరి జ్యోతితోపాటు పలువురిపై జ్యోత్న్స ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం జ్యోతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మహమ్మద్ కలీమ్‌తో పాటు పలువురు పరారీలో ఉన్నారు. సమావేశంలో ఎస్సై విష్ణు వర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.
చిన్నారుల మృతికి కారకులైన ఇద్దరిపై..
ఆదిలాబాద్‌రూరల్: మావల బంజారాహిల్స్ శివారు ప్రాంతంలో రోడ్డుకు అనుకుని ఉన్న నీటికుంటలో ప్రమాదవశాత్తు పడి చిన్నారుల మృతికి కారకులైన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కర్రె స్వామి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మావల మండల కేంద్రానికి చెందిన స్వామి, గీత దంపతుల కుమారులు వి నూత్న (11), విదాత్ (10)లు శనివారం సైకిల్ ఆడుకుంటూ బంజారాహిల్స్ రోడ్డు గుండా వెళ్తున్నారు. మార్గమధ్యలో నిర్మల్కర్ భాస్కర్‌కు చెందిన భూమిలో ఉన్న నీటికుంటలో పడ్డారు. దీంతో వారు అక్కడికి అక్కడే మృతి చెందారు. అయితే ఆదిలాబాద్‌లోని భుక్తపూర్ కాలనీకి చెందిన యతేంద్రనాథ్ యాదవ్‌కు పట్టేదారు అభివృద్ధి, భూమి నిర్వహణ కోసం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఆ భూమిని ఇచ్చారు. వారి నిర్లక్ష్యంతోనే చిన్నారులు నీటికుంటలో పడి మృతి చెందారని ఆరోపిస్తూ మా వల తహసీల్దార్ వేణుగోపాల్, మృతుల తండ్రి స్వామి ఇరువురు ఆదివారం ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
బీసీ మేధావుల ఫోరం కార్యవర్గం
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలో బీసీ మేధావుల ఫోరం ఉమ్మడి జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా చీఫ్ కోఆర్డినేటర్‌గా శ్రీరాముల కొండయ్య, కోఆర్డినేటర్లుగా డాక్టర్ నీలకంఠేశ్వర్‌గౌడ్, రంగు రాజేశం, కనుకుట్ల మల్లయ్య, షబ్బీర్ పాషా, సమ్ము రాజయ్య, కోడూరి చంద్రయ్య, అశోక్ యాదవ్, తునికి ప్రవీణ్, అక్కల నాగరాజు, జైనుద్దీన్, లింగమూర్తి, రవి ఎన్నికయ్యారు. రాష్ట్ర చైర్మన్ చిరంజీవులు వారికి నియామకపత్రాలు జారీ చేశారు.