
విత్తనాలు కొంటున్నారా?
● జాగ్రత్తలు తప్పనిసరి
చెన్నూర్‌రూరల్: మరికొద్ది రోజుల్లో వానాకాలం సాగు ప్రారంభమవుతోంది. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోలులో రైతులు బిజీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమతులు లేని కంపెనీలకు చెందిన విత్తనాలు, కల్తీ విత్తనాలు మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది. రైతులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అన్ని వివరాలు పరిశీలించాకే కొనుగోలు చేయాలి. అనుమానం వస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించాలని చెన్నూర్ ఏవో యామిని సూచించారు. లైసెన్స్ లేని దుకాణాలు, దళారుల వద్ద ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయకూడదు. సరుకు, లాట్ నంబర్, తయారీ, తేదీ, రకం ఇలా అన్ని వివరాలు ఉండి సంతకం చేసిన బిల్లును విక్రయదారు (షాపు) నుంచి తప్పనిసరిగా తీసుకోవాలి. సంచులపై సీల్ తీసినట్లు లేదా విప్పదీసి తిరిగి కుట్లు వేసినట్లు కనిపిస్తే తీసుకోకూడదు. వ్యవసాయశాఖ నుంచి అనుమతి పొందిన డీలర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సహకార సంఘాల నుంచి మాత్రమే ఎరువులు కొనుగోలు చేయాలి. క్రిమిసంహారక మందుల డబ్బాలపై కంపెనీ పేరు, తేదీ, కాలపరిమితి, గమనించి రసీదులు తీసుకోవాలి. ఏది ఎంత ధరతో కొన్నా.. డీలర్ లేదా దుకాణాదారు సంతకంతో తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలి. మీరు తీసుకున్న విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు నకిలీవని అనుమానం వస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలి. అలాగే లాట్ నంబర్, తయారీ తేదీలను తప్పనిసరిగా చూసుకోవాలి. లేదంటే గతేడాది విత్తనాలు, మందులు, ఎరువులు అంటకడతారు. రైతులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి కాలం చెల్లిన మందులు, ఎరువులు, విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. అలాగే మందు డబ్బాలపై ఆకుపచ్చని లేబుల్ ఉందో లేదో గమనించాలి. ఆకుపచ్చ లేబుల్ ఉంటేనే ఆ మందును కొనుగోలు చేయాలి. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోలు విషయంలో రైతులు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించి నాణ్యమైన దిగుబడులు పొందాలి.