
విభే దాలు వీడి ఐక్యంగా పనిచేయాలి
భైంసాటౌన్: పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం రసాభాసగా మారింది. పీసీసీ పరిశీలకుల ముందే నేతలు, వారి అనుచరులు బాహాబాహీకి దిగడంతో గందరగోళం నెలకొంది. పార్టీలో కొత్తగా చేరినవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ కోసం పనిచేసేవారికి గుర్తింపు ఉండడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే బి.నారాయణ్‌రావు వర్గీయులు వేదికపై ఉన్న పీసీసీ పరిశీలకులు చంద్రశేఖర్‌గౌడ్, ఎండీ.అవేస్ దృష్టికి తెచ్చారు. దీంతో మాజీ ఎమ్మెల్యే జి విఠల్‌రెడ్డి వర్గీయులు, పటేల్ వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దాదాపు అరగంటకుపైగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో గందరగోళం నెలకొంది. రాష్ట్ర నేతలు కలుగజేసుకుని సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం సభనుద్దేశించి పీసీసీ పరిశీలకులు చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నేతల మధ్య సఖ్యత లేకనే కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాయితీపై వంటగ్యాస్ సిలిండర్, ఉచిత గృహ విద్యుత్, రైతులకు రుణమాఫీ, రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం వంటి హామీలు అమలు చేస్తున్నా.. గ్రూపు తగాదాలతో నియోజకవర్గంలో పార్టీ చతికిలపడి, మూడో పార్టీ బలం పుంజుకుంటోందన్నారు. ఇప్పటికై నా నేతలు విభేదాలు వీడి పార్టీ కోసం కష్టపడి పని చేయాలన్నారు. పార్టీ విధానాల ప్రకారం.. నియోజకవర్గ ఇన్‌చార్జి బి.నారాయణ్‌రావు పటేల్ ఆధ్వర్యంలోనే పార్టీ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. అందరు కలిసికట్టుగా పనిచేసి, రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బి.నారాయణ్‌రావు పటేల్, జి.విఠల్‌రెడ్డి, ఎస్.వేణుగోపాలచారి, ఏఎంసీ చైర్మన్ సిందే ఆనంద్‌రావు పటేల్, వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ పరిశీలకులు
చంద్రశేఖర్‌గౌడ్, అవేజ్
రసాభాసగా ముధోల్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం

విభే దాలు వీడి ఐక్యంగా పనిచేయాలి