గోడు వినండి.. గోస తీర్చండి | - | Sakshi
Sakshi News home page

గోడు వినండి.. గోస తీర్చండి

Mar 25 2025 12:08 AM | Updated on Mar 25 2025 12:08 AM

గోడు

గోడు వినండి.. గోస తీర్చండి

● ప్రజావాణిలో కలెక్టర్‌ను అర్జీదారుల వేడుకోలు ● తక్షణమే పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశం ● గ్రీవెన్స్‌కు 8 ఫోన్‌ కాల్స్‌, 76 దరఖాస్తులు

నిర్మల్‌చైన్‌గేట్‌: కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు బారులు తీరారు. వివిధ సమస్యలతో వచ్చిన పలువురు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌కు అర్జీలు సమర్పించి తమ గోడు వెల్లబోసుకున్నారు. గోస తీర్చాలని వేడుకున్నారు. అర్జీదారుల సమస్యలు ఓపికగా విన్న కలెక్టర్‌ బాధితుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్‌ బెడ్‌రూం తదితర సమస్యలు పరిష్కరించాలని ప్రజలు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. శాఖ ల వారీగా అధికారులందరూ సమయానికి ప్రజా వాణికి హాజరుకావాలని ఆదేశించారు. ప్రజావాణి రిజిస్టర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి రేషన్‌ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయడానికి ఏర్పాట్లను పూర్తి చేయాలని పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలను సందర్శిస్తూ, నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించాలన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఫైజాన్‌ అహ్మద్‌, కిశోర్‌కుమార్‌, ఆర్డీఓ రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

టెలి ప్రజావాణికి 8 ఫోన్‌కాల్స్‌..

వేసవి నేపథ్యంలో దూర ప్రాంత ప్రజల సౌకర్యార్థం సోమవారం నుంచి టెలి ప్రజావాణి ప్రారంభించారు. ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ప్రజల ఫోన్‌కాల్‌ స్వీకరించి మాట్లాడారు. వాటిని నమోదు చేసుకొని సంబంధిత అధికారులకు ఆయా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం టెలిఫోన్‌ ప్రజావాణి ద్వారా 8 మంది, నేరుగా 76 మంది దరఖాస్తుదారులు వివిధ ప్రాంతాల నుంచి తమ అర్జీలను సమర్పించారు. ఫోన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తు వివరాలను వాట్సాప్‌ ద్వారా స్వీకరించి ప్రజావాణిలో సమస్య నమోదుకు సంబంధించి రశీదును వాట్సాప్‌ ద్వారా అందించారు.

గోడు వినండి.. గోస తీర్చండి 1
1/1

గోడు వినండి.. గోస తీర్చండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement