‘పది’ ఫలితాల్లో హ్యాట్రిక్‌ కొడతాం | - | Sakshi
Sakshi News home page

‘పది’ ఫలితాల్లో హ్యాట్రిక్‌ కొడతాం

Mar 20 2025 1:42 AM | Updated on Mar 20 2025 1:40 AM

● మూడోసారి కూడా రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తాం ● జిల్లా విద్యాధికారి రామారావు

నిర్మల్‌ రూరల్‌: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈసారి కూ డా రాష్ట్ర స్థాయిలో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతా మని జిల్లా విద్యాధికారి (డీఈవో) రామారావు ధీమా వ్యక్తంజేశారు. ఈనెల 21నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయనను ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేయగా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

సాక్షి: జిల్లాలో ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు? జిల్లా వ్యాప్తంగా ఎన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు?

డీఈవో: జిల్లాలో మొత్తం 9,129 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో బాలికలు 4,685, బాలురు 4,444 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇందులో నిర్మల్‌లో 22, భైంసాలో 19, ఖానాపూర్‌లో ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతీ కేంద్రానికి ఒక ముఖ్య పర్యవేక్షణాధికారి, సిట్టింగ్‌ స్క్వాడ్‌ను నియమించాం. అన్ని కేంద్రాల్లో 523 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు.

సాక్షి: ఉత్తమ ఫలితాల సాధనకు ఎలాంటి చర్యలు చేపట్టారు?

డీఈవో: విద్యార్థులకు రెండు గ్రాండ్‌ టెస్టులు నిర్వహించాం. ప్రీ ఫైనల్‌ పరీక్షలు కూడా పూర్తి చేశాం. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాం. వీరిని ఉపాధ్యాయులు దత్తత తీసుకునేలా చర్యలు చేపట్టాం. ఉదయం, సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు నిర్వహించాం. మా కృషి ఫలితంగా ఈసారి కూడా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్‌ సాధిస్తాం.

సాక్షి: ఉష్ణోగ్రతలు పెరిగినందున కేంద్రాల వద్ద కల్పిస్తున్న వసతులేమిటి?

డీఈవో: ఎండల తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద చల్లని తాగునీరు అందుబాటులో ఉంచేలా చూస్తాం. ప్రతీ కేంద్రం వద్ద ఒక ఏఎన్‌ఎం, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని వసతులూ కల్పిస్తున్నాం.

సాక్షి: ఈసారి పరీక్షా విధానంలో బోర్డు చేసిన మార్పుల గురించి తెలుపండి?

డీఈవో: పరీక్షా ఫలితాల్లో గ్రేడింగ్‌ విధానాన్ని రద్దు చేసి మునుపటిలా మార్కులు ప్రకటించనున్నారు. విద్యార్థులకు ఈసారి సింగిల్‌ రూల్స్‌గల 24 పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. ఇందులోనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అదనపు సమాధాన పత్రం ఇవ్వరు. గతంలో బయోలజీ, ఫిజికల్‌ సైన్స్‌ పరీక్షలు ఒకేరోజు నిర్వహించగా ఈసారి వేర్వేరుగా రెండు రోజులు నిర్వహిస్తారు.

సాక్షి: విద్యార్థులకు మీరిచ్చే సూచనలు?

డీఈవో: విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలి. ఐదు నిమిషాలు వెసులుబాటు కల్పిస్తాం. హాల్‌టికెట్‌ అందనివారు వెబ్‌సైట్‌ నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

‘పది’ ఫలితాల్లో హ్యాట్రిక్‌ కొడతాం 1
1/1

‘పది’ ఫలితాల్లో హ్యాట్రిక్‌ కొడతాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement