అటవీశాఖ అనుమతులు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అటవీశాఖ అనుమతులు తీసుకోవాలి

Mar 14 2025 1:45 AM | Updated on Mar 14 2025 1:43 AM

● డీఎఫ్‌వో నాగిని భాను ● హరితవనం పరిశీలన ● అభివృద్ధిని అడ్డుకోవద్దని గ్రామస్తుల వినతి

దస్తురాబాద్‌: అటవీశాఖ అనుమతులు ఉన్నప్పుడే అటవీశాఖ పరిధిలో పనులు చేపట్టేందుకు అంగీకరిస్తామని డీఎఫ్‌వో నాగిని భాను తెలిపారు. మండలంలోని దేవునిగూడెం గ్రామస్తులు కేసీఆర్‌ హరిత వనంలో మరో 200 చెట్లు నరికి వేశారు. అటవీ అధికారులు డీఎఫ్‌వోకు సమాచారం అందించారు. గురువారం దేవునిగూడెం చేరుకుని నరికివేసిన చెట్లను పరిశీలించారు. అటవీశాఖ పరిధిలో పనులు చేయాలంటే అనుమతులు తప్పనిసరి అన్నారు. నల్ల పోచమ్మ ఆలయం, రహదారి నిర్మాణం చేపట్టాలంటే ఆయా శాఖలైన దేవాదాయ, పంచాయతీరాజ్‌ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనుమతి ఇస్తామన్నారు. చెట్లు నరికివేసినవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనుమతులు ఇచ్చే వరకూ పోరాడుతాం..

గ్రామానికి కష్టపడి బీటీ రోడ్డు మంజూరు చేయించుకున్నామన్నారు. మంజూరైన రోడ్డును అడ్డుకోవడం సరికాదని గ్రామస్తులు అన్నారు. అనుమతులు, అంక్షల పేరుతో గ్రామాభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని కోరారు. అభివృద్ధికి అడ్డుగా ఉంటే ధ్వంసం చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ హరితవనాన్ని ధ్వంసం చేశామన్నారు. అటవీ అనుమతులు వచ్చే వరకు పోరాడుతామని తెలిపారు. జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు.

గ్రామస్తులతో మాట్లాడిన తహసీల్దార్‌...

ఇదిలా ఉంటే దేవునిగూడెం గ్రామస్తులతో తహసీల్దార్‌ సర్ఫరాజ్‌ నవాజ్‌ మాట్లాడారు. హరిత వనంలో చెట్లు నరికివేయడం సరికాదని పేర్కొన్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. మండలం పరిధిలో 5,300 ఎకరాల్లో రెవెన్యూ, అటవీశాఖ పరిధిలో వివాదాస్పద భూమి ఉందని, రెండు శాఖలు సంయుక్తంగా సర్వే చేస్తేనే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. గ్రామస్తుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో భవానీశంకర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ యాదవరావ్‌, కడెం, ఖానాపూర్‌, పెంబి, మమాడ, నిర్మల్‌ అటవీ అధికారలు, సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement