నిర్మల్‌ఖిల్లా: ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యార్థులు సైతం చదువులో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వివిధ కార్యక్రమాలు అమలు పరుస్తోంది. ఇందులో భాగంగానే రెండేళ్లుగా ప్రభుత్వ రంగంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఎఫ్‌ఎల్‌ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసి) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. గతంలో నిర్వహించిన మదింపు పరీక్షల్లో జిల్లాలోని ప్రాథమిక స్థాయి విద్యార్థులు సామర్థ్యాలలో వెనుకంజలో ఉన్నట్లు ఫలితాల నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో తాజాగా ఆ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలకు ఏ మేరకు చేరువయ్యారనే అంశంపై అంచనా వేసేందుకు విద్యాశాఖ నేటి నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక సర్వే నిర్వహించనుంది. ఈ మేరకు జిల్లా పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతీ పాఠశాలలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు స్వీయ పఠనం, రాయడం, గణితంలోని చతుర్విధ ప్రక్రియలు సాధించేలా రెండేళ్లుగా వివిధ కార్యక్రమాల ద్వారా కృత్యాధార బోధన చేపడుతూ బోధన కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఈ అంశాల్లో విద్యార్థుల అభ్యసనం కొనసాగుతున్న విధానాన్ని గుర్తించేందుకు ఆయా పాఠశాలల్లో రెండోతరగతి చదువుతున్న విద్యార్థులను పరీక్షించేందుకు సామర్ధ్య ఆధారిత సర్వే చేపట్టనుంది.
నేటి నుంచి సర్వే...
జిల్లాలో ఎంపిక చేసిన 50 ప్రభుత్వ పాఠశాలల్లో రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను గణించేందుకు సర్వే చేపడుతోంది. జిల్లాలోని మొత్తం 19 మండలాల పరిధిలోని 50 వివిధ ప్రాథమిక పాఠశాలలను పాఠశాల విద్యాశాఖ ఇందుకోసం ఎంపిక చేసింది. ఈ సర్వే కోసం ఇప్పటికే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లను ఎంపిక చేసి శిక్షణ అందించింది. వీరు ఆయా పాఠశాలల్లో రెండోతరగతి చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు సర్వే పరీక్షలను మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఇందులో రెండో తరగతి విద్యార్థులంతా వందశాతం హాజరయ్యేలా, సర్వే సజావుగా నిర్వహించేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల జిల్లాస్థాయి విద్యాశాఖ అధికారులు సమన్వయం చేయనున్నారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో సర్వే పూర్తి చేయనున్నారు. సర్వే సమయంలో ఆయా పాఠశాలలను సందర్శించి భాషా సామర్థ్యాలు, చతుర్విధ ప్రక్రియలపై సర్వే పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ అంశాలపై ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు, కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్లకు జిల్లా స్థాయిలో శిక్షణ పూర్తి చేశారు. తెలుగు, ఆంగ్లంలో చదవడం రాయడంతో పాటు గణితంలోని చతుర్విధ ప్రక్రియలపై ఈ సర్వేలో ప్రశ్నలుంటాయి. ఈ సర్వే ద్వారా సేకరించిన అంశాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు.
సజావుగా సర్వే నిర్వహణకు ఆదేశాలు
ఎంపిక చేసిన పాఠశాలల్లో రెండోతరగతి విద్యార్థులు పూర్తిస్థాయిలో సర్వే పరీక్షలకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆయా పాఠశాలల హెచ్‌ఎంలపై ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే సర్వే నిర్వాహణకు సంబంధించి ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలకు డీఈవో పి.రామారావు ఆదేశాలు జారీ చేశారు. కాంప్లెక్స్ హెచ్‌ఎంలు తమ పరిధిలోని పరీక్షలు నిర్వహించే పాఠశాలలను సందర్శించి సర్వే సజావుగా కొనసాగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎఫ్‌ఎల్‌ఎన్‌పై శాంపిల్ సర్వే
రెండోతరగతి విద్యార్థుల సామర్థ్యాల మదింపు
నేటి నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక పరీక్షలు
వివరాలు ప్రత్యేక యాప్‌లో నమోదు