● డీఈవో రామారావు
సోన్: పదో తరగతి వార్షిక పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తామని డీఈవో రామారావు తెలిపారు. మండలంలోని కడ్తాల్ ఉన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. పదో తరగతికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఇంగ్లిష్ పీరియడ్‌ను పరిశీలించారు. గ్రాండ్ టెస్టు మార్కుల ఆధారంగా విద్యార్థులను పిలిచి అన్ని విషయాల్లో వారి ప్రగతిని పరిశీలించారు. గణితం, ఆంగ్లంలో మంచి మార్కులు పొందాలంటే ఇంకా కష్టపడాలని సూచించారు. పరీక్షల వరకు విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా రావాలని సూచించారు. పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఉండదని, పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. డీఈవో వెంట హెచ్‌ఎం వెంకటేశ్వర్, పరీక్షల సహాయ కార్యదర్శి భానుమూర్తి, ఆంగ్ల ఉపాధ్యాయురాలు శైలజ ఉన్నారు.