
షేక్ రహీం మృతదేహం
లోకేశ్వరం: పురుగుల మందుతాగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై సాయికుమార్ వివరాల ప్రకారం... నగర్ గ్రామానికి చెందిన షేక్ రహీం (33) భార్య మౌలానితో నాలుగేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి రహీం తాగుడుకు బానిసయ్యాడు. ఒంటరితనం భరించలేక మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు గమనించి 108లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. తమ్ముడు షేక్ జాఫర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అదుపు తప్పి లారీ బోల్తా..
భైంసాటౌన్: పట్టణంలోని భైంసా–బాసర రహదారిపై బుధవారం వేకువజామున లారీ అదుపుతప్పి బోల్తాపడింది. భైంసాలోని కాటన్ జిన్నింగ్ మిల్లు నుంచి పత్తి బేళ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ స్థానిక హరియాలీ ఫంక్షన్‌హాల్ సమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో లారీలో పత్తిబేళ్లు కింద పడిపోయాయి. డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. 161 బీబీ రహదారి పనుల్లో జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, పనులు జరుగుతున్న చోట హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
కాలువ నీటిలో గల్లంతై యువకుడు మృతి
దండేపల్లి(మంచిర్యాల): ప్రమాదవశాత్తు కాలువ నీటిలో గల్లంతై యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సాంబమూర్తి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ముత్యంపేటకు చెందిన ఒర్సు మల్లేశ్ (22) బుధవారం సాయంత్రం మిత్రులతో కలిసి కాలువలో స్నానం చేసేందుకు వెళ్లాడు. లిఫ్టు డెలివరీ పాయింట్ సమీపంలోనే కాలువలోకి దిగి స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నీటిప్రవాహం ఎక్కువ రావడంతో నీటిలో మునిగి గల్లంతయ్యాడు. గమనించిన మిత్రులు నీటిలో గాలించినా దొరకకపోవడంతో పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్సై సాంబమూర్తి ఈతగాళ్ల సాయంతో కాల్వలో వెతికించగా మృతదేహం లభించింది. మృతదేహాన్ని లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
‘లీకేజీ’కి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
పాతమంచిర్యాల: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.బాబన్న అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లీకేజీల వెనుక కేవలం ఇద్దరు ఉద్యోగుల హస్తం ఉందని మంత్రి కేటీఆర్ వాస్తవాలను పక్కదోవ పట్టించడమే అన్నారు. పాలకుల అసమర్ధత వల్లే ప్రశ్నాపత్రాలు లీకేజీ అవుతున్నాయని, అది పెద్దల అండదండలతో ఒక వ్యాపారంగా ఎదిగిందన్నారు. ఫలితంగా విద్యార్థులు భవిష్యత్‌పై నమ్మకం కోల్పోయారన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోనేల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ప్రదీప్, విద్యార్థి యువజన సమితి జిల్లా అధ్యక్షుడు ఎండీ సిరాజ్, ప్రవీణ్ పాల్గొన్నారు.