
ధరణి తప్పు.. భూభారతి సరిచేసేనా?
లక్ష్మణచాంంద: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2020 అక్టోబరు 24న అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. అయితే, ఈ పోర్టల్ అమలుతో లక్ష్మణచాంద మండలంలోని న్యూకంజర్, పొట్టపల్లి (బి), పొట్టపల్లి (కే) గ్రామాల రైతుల భూములు అసైన్డ్ భూములుగా పోర్టల్‌లో నమోదు చేశారు. ఈ మూడు గ్రామాల రైతులకు జారీ చేసిన పట్టా పాస్‌బుక్‌లలో భూములు అసైన్డ్‌గా నమోద అయ్యాయి. దీంతో ఐదేళ్లుగా ఈ మూడు గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సమస్య రైతులను ఆర్థిక, మానసిక ఒత్తిడిలోకి నెట్టింది.
భూ భారతితో రైతుల్లో ఆశలు..
2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ధరణి పోర్టల్‌ను రద్దు చేసి భూ భారతి చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ నూతన పోర్టల్‌తో రైతుల భూమి సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశలు మూడు గ్రామాల రైతుల్లో చిగురించాయి. రైతులు తమ భూముల క్రయవిక్రయాలకు వెసులుబాటు వస్తుందని ఆశిస్తున్నారు.
పరిష్కారానికి మంత్రి హామీ..
రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈనెల 17న కుంటాల మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుకు వచ్చారు. దీంతో న్యూకంజర్ రైతుల సమస్యను డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్యను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్‌ను ఆదేశించారు. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని సమస్యను త్వరగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
పట్టా భూములను అసైన్డ్‌గా నమోదు..
ఐదేళ్లుగా క్రయ విక్రయాలు జరగని వైనం..
అవసరానికి అమ్ముకోలేక అన్నదాత అవస్థలు..
కొత్త చట్టంలో మూడు గ్రామాల రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
ఐదేళ్లుగా ఇబ్బంది..
ధరణి పోర్టల్ చేసిన తప్పుకు ఐదేళ్లుగా ఇబ్బంది పడుతున్నాం. మా ఊరి భూములన్నీ ధరణిలో అసైన్డ్‌గా నమోదయ్యాయి. అసైన్డ్ భూములు విక్రయించే అవకాశం లేకపోవడంతో భూమి ఉన్నా.. అత్యసర పరిస్థితిలో అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నాం. సమస్య పరిష్కారం కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నాం. భూభారతి చట్టం రాకతో సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం.
– ముద్దం మోహన్ రెడ్డి, న్యూ కంజర్ రైతు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు
మండలంలోని న్యూకంజర్, పొట్టపల్లి(బి), పొట్టపల్లి(కె) గ్రామాలకు చెందిన 628 సర్వే నంబర్ల భూ సమస్యను గతంలోనే ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు సీసీఎల్‌ఏ కమిషనర్‌కు నివేదించాం. అయితే సమస్య పరిష్కారం కాలేదు. ప్రస్తుతం కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
– జానకి, తహసీల్దార్, లక్ష్మణచాంద
ఈ రైతు పేరు మాస్తా సాయన్న. లక్ష్మణచాంద మండలం న్యూ కంజర్ గ్రామానికి చెందిన ఈ యువరైతుకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2020లో గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌తో సాయన్న పట్టాభూమి మొత్తం అసైన్డ్ భూమిగా నమోదు అయింది. అప్పటి నుండి తన భూమిని అవసరానికి అమ్మలేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమస్య ఈ ఒక్క రైతుదే కాదు న్యూకంజర్ గ్రామంలోని రైతులదీ ఇదే పరిస్థితి.
ఓ రైతు పహణీలో అసైన్డ్‌గా నమోదు(వృత్తంలో..)
ఐదేళ్లుగా నిరీక్షణ..
ధరణి పోర్టల్ ప్రవేశపెట్టిన 2020 నుంచి ఈ మూడు గ్రామాల రైతులు సమస్య పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామస్థాయి అధికారుల నుంచి రాష్ట్ర మంత్రుల వరకు, ప్రజాప్రతినిధుల నుంచి ఉన్నతాధికారుల వరకు రైతులు తమ ఆవేదన చెప్పుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. మండలంలో న్యూకంజర్‌కు చెందిన 465, పొట్టపల్లి (బి)కి 123, పొట్టపల్లి(కె)కు 40 సర్వే నంబర్లు మొత్తం 628 సర్వే నంబర్ల భూముల అసైన్డ్ గానే నమోదయ్యాయి. దీంతో క్రయవిక్రయాలు ఆగిపోయాయి. కొందరు రైతులు పిల్లల పెళ్లిళ్ల కోసం భూములు అమ్మగా, రిజిస్ట్రేషన్ కాకపోవడంతో కొనుగోలుదారులకు ఇచ్చిన డబ్బులను అప్పుగా పత్రాలు రాయించుకున్నారు.

ధరణి తప్పు.. భూభారతి సరిచేసేనా?

ధరణి తప్పు.. భూభారతి సరిచేసేనా?

ధరణి తప్పు.. భూభారతి సరిచేసేనా?