జైకోవ్‌–డి వ్యాక్సిన్‌ రూ.1,900

Zydus pegs Covid vaccine at Rs 1900 - Sakshi

న్యూఢిల్లీ: ఔషధ సంస్థ జైడస్‌ క్యాడిలా దేశీయంగా రూపొందించిన కరోనా టీకా జైకోవ్‌–డి త్వరలోనే మార్కెట్‌లో ప్రవేశించనుంది. 12 ఏళ్లుపై బడిన వారికి జైకోవ్‌–డి ధర మూడు డోసులకు గాను రూ.1,900గా కంపెనీ నిర్ణయించింది. అయితే, జైడస్‌ క్యాడిలాతో కేంద్రం జరుపుతున్న చర్చల ఫలితంగా ధర తగ్గే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ వారంలోనే టీకా ధరపై స్పష్టతవస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

దేశీయంగా తయారవుతున్న జైకోవ్‌–డి ప్రపంచంలోనే మొట్టమొదటి డీఎన్‌ఏ ఆధారిత   టీకా. 0, 28, 56 రోజుల వ్యవధిలో మూడు డోసులుగా ఇవ్వాల్సిన ఈ టీకా ధర పన్నులు కలుపుకుని రూ.1,900గా నిర్ణయించినట్లు క్యాడిలా వర్గాలు తెలిపాయి. ఈ టీకాను సూదికి బదులుగా జెట్‌ ఇంజెక్టర్‌తో ఇవ్వాల్సి ఉంటుంది. ఇంజెక్టర్‌ ధర రూ.30 వేలు కాగా, ఒక్కో ఇంజెక్టర్‌తో 20 వేల డోసుల టీకా ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ టీకాలను రెండు డోసుల సూది మందుగా ఇస్తున్నారు. దేశవ్యాప్త కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌తోపాటు, ఇతర ఆరోగ్య సమస్యలున్న 12–18 ఏళ్ల గ్రూపులోని వారికి ముందుగా జైకోవ్‌–డిని ఇచ్చే విషయమై జాతీయ నిపుణుల బృందం(ఎన్‌టీఏజీఐ) ఇచ్చే సూచనల కోసం వేచి చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top