ఇంధన, గ్యాస్ కొరతపై కేంద్ర కార్యదర్శి డాక్టర్ నీరజ మిట్టల్‌కు వివరిస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
బల్క్ బయ్యర్లకు మేలు చేసేందుకే చట్ట విరుద్ధమైన సర్క్యులర్
రూ.153 విలువైన కమర్షియల్ డీజిల్‌ను రిటైల్ బంకుల్లో రూ.98కే ఇప్పించే కుట్ర
రాష్ట్రంలో 70 శాతం బంకుల్లో నిల్వలు నిల్.. ఎక్కడికక్కడ ఇంధన రేషనింగ్
బాధ్యతను ఆయిల్ కంపెనీలపైకి నెట్టేస్తూ సీఎం చంద్రబాబు డ్రామాలు
కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శికి వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఫిర్యాదు
తక్షణమే ఆ సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని ఏపీ సీఎస్‌కు కేంద్రం లేఖ
రెండు మూడు రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతామని హామీ
ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్‌తో వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్రెడ్డి సమావేశం
రాష్ట్రంలో ఇంధన సంక్షోభం, ఏపీ సర్కారు వైఫల్యంపై చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న ఇంధన కొరత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ స్వయంకృతాపరాధమేనని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. కమర్షియల్ డీజిల్‌ను రిటైల్ బంకుల్లో కొనుగోలు చేసేందుకు వీలుగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కమిషనర్ ఇచ్చిన అక్రమ ఆదేశాలే ఈ కృత్రిమ కొరతకు కారణమని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్‌తో ఎంపీ అవినాష్రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో డిమాండ్‌కు, సప్లైకి మధ్య ఉన్న భారీ వ్యత్యాసంపై కేంద్ర కార్యదర్శితో చర్చించారు. ఏపీలో నెలకొన్న దయనీయ పరిస్థితులను వివరిస్తూ ఆధారాలతో కూడిన ఒక లేఖను ఆయనకు అందజేశారు.
కేంద్ర కార్యదర్శితో భేటీ అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఏపీలో డిమాండ్, సప్లైకి మధ్య ఇంత గ్యాప్ ఎందుకు ఉందని, దేశంలో కేవలం ఒక్క ఏపీలోనే ఈ కొరత ఎందుకు ఉందని కేంద్ర కార్యదర్శిని అడగగా... దీనికి కేంద్ర కార్యదర్శి ఇచ్చిన సమాధానాలు విస్మయం కలిగించాయని అనంతరం అవినాష్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా ఆయన తన ఆఫీసు నుంచి దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అన్ని ఆయిల్ కంపెనీలకు ఒక సర్క్యులర్ రాశారని... కమర్షియల్ డీజిల్, బల్క్ డీజిల్‌ను సామాన్య ప్రజలు కొనుగోలు చేసే సాధారణ పెట్రోల్ బంకుల్లో (రిటైల్ అవుట్‌లెట్లలో) అమ్మాలని ఆ సర్క్యులర్‌లో ఆదేశించారన్న విషయాన్ని కేంద్ర పెట్రోలియం కార్యదర్శి తెలిపారన్నారు. ఇది సివిల్ సప్లైస్ కమిషనర్ ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారో తెలియజేస్తోందని అవినాష్ రెడ్డి విమర్శించారు.
బల్క్ బయ్యర్లకు దోచిపెట్టే పన్నాగం
బల్క్ డీజిల్‌ను సాధారణ రిటైల్ బంకుల నుంచి విక్రయించాలంటూ ఏపీ సివిల్ సప్లైస్ కమిషనర్ ఆయిల్ కంపెనీలకు లేఖ రాయడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని వైఎస్ అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు. సాధారణ బంకుల్లో లీటర్ డీజిల్ రూ.98కి లభిస్తుండగా, కమర్షియల్ బల్క్ డీజిల్ ధర రూ.153గా ఉందన్నారు. ఈ వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని బల్క్ కొనుగోలుదారులకు లాభం చేకూర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కుట్రకు తెరతీసిందని ఆరోపించారు. ‘ఒక్కో బల్క్ బయ్యరు రిటైల్ బంకులకు వచ్చి ఐదు వేల నుంచి 10 వేల లీటర్లు తీసుకెళ్తే, ఇక సామాన్య ప్రజలకు డీజిల్ ఎలా దొరుకుతుంది? సామాన్యులు ఇంధనం కొనుగోలు చేసే చోట కమర్షియల్ వారికి అవకాశం ఎలా ఇస్తారు? బల్క్ బయ్యర్స్ కొనుగోలుకు ప్రత్యేక వ్యవస్థ ఉన్నప్పటికీ ఇలాంటి సర్క్యులర్ ఇవ్వడం ముమ్మాటికీ చట్ట వ్యతిరేకమే‘ అని ఆయన స్పష్టం చేశారు.
కేంద్రం చెబుతున్నది ఒకటి.. రాష్ట్రంలో జరుగుతున్నది మరొకటి
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా, ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని ఎంపీ అవినాష్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 4,510 ఇంధన కేంద్రాల్లో దాదాపు 70 శాతం పనిచేయడం లేదని, ఎక్కడ చూసినా ’నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఇంధనాన్ని రేషనింగ్ పద్ధతిలో ఇస్తున్నారని, కార్లకు 10 నుంచి 15 లీటర్ల డీజిల్, ద్విచక్ర వాహనాలకు రూ.200 విలువైన పెట్రోల్ మాత్రమే పరిమితంగా పోస్తున్నారని అవినాష్ రెడ్డి వివరించారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఇలాంటి కొరత ఏమాత్రం లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
చంద్రబాబు డ్రామాలు.. కేంద్రం మొట్టికాయలు
ఈ ఇంధన కొరత సమస్యకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బుకాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అవినాష్ రెడ్డి విమర్శించారు. సమీక్షల పేరుతో ఆయిల్ కంపెనీలపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ ఉద్దేశపూర్వకంగా లీకులు ఇస్తూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అయితే, ఈ ఇంధన సంక్షోభానికి ఏపీ ప్రభుత్వమే ప్రధాన కారణమని కేంద్రం కుండబద్దలు కొట్టిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జారీ చేసిన సర్క్యులర్ వల్లే ఈ దుస్థితి తలెత్తిందని, తక్షణమే ఆ సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి ఇప్పటికే లేఖ రాసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. కేవలం ఏపీలో మాత్రమే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ సర్క్యులర్ ద్వారా కమర్షియల్ డీజిల్‌ను సాధారణ బంకుల్లో కొనుగోలు చేసే అవకాశం కలి్పంచడమే అని అవినాష్ రెడ్డి విమర్శించారు.
బ్లాక్ మార్కెట్ మాఫియాతో కుమ్మక్కు.. కళ్లు తెరిచి పరిస్థితిని చక్కదిద్దాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కలిగించాల్సింది పోయి, బ్లాక్ మార్కెట్ మాఫియాతో కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఎంపీ అవినాష్రెడ్డి ఆరోపించారు. డీజిల్ కొరత వల్ల అగ్రి, ఆక్వా, రవాణా సహా అన్ని వర్గాల ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధనం, ఎల్పీజీ సిలిండర్ల అనైతిక హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్ విచ్చలవిడిగా జరుగుతోందని తెలిపారు. కేంద్రం నుంచి తగినంత చమురు సరఫరా ఉన్నప్పటికీ ఏపీలో ఇంధన కొరత ఎందుకు ఉందో విచారణ జరపాలని, పర్యవేక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయాలని ఆయన కేంద్ర కార్యదర్శిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కళ్లు తెరిచి పరిస్థితిని సరిదిద్దాలని, వివాదాస్పద సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన ఫిర్యాదుకు స్పందించిన కేంద్రం.. రెండు మూడు రోజుల్లో ఏపీలో పరిస్థితిని చక్కదిద్దుతామని హామీ ఇచ్చినట్లు అవినాష్ రెడ్డి చెప్పారు.


