రఫేల్‌కు మహిళా పైలట్‌

Woman fighter pilot selected to fly Rafale combat jets - Sakshi

అంబాలా కేంద్రంగా పనిచేసే గోల్డెన్‌ యారోస్‌ స్క్వాడ్రన్‌లోకి మిగ్‌ యుద్ధవిమాన మహిళా పైలట్‌ ఎంపిక

న్యూఢిల్లీ: వైమానిక దళంలో ఇటీవలే చేరిన అత్యాధునిక రఫేల్‌ ఫైటర్‌ జెట్ల దళంలోకి త్వరలో మహిళా పైలట్‌ ఒకరు చేరనున్నారు. మిగ్‌–21 ఫైటర్‌ జెట్ల మహిళా పైలట్‌ ఒకరు అంబాలా కేంద్రంగా పనిచేసే గోల్డెన్‌ యారోస్‌ స్క్వాడ్రన్‌లోకి ఎంపికయ్యారని భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) అధికారి ఒకరు తెలిపారు. రఫేల్‌ ఫైటర్‌ జెట్‌ పైలట్‌ కోసం చేపట్టిన అత్యంత కఠినమైన పరీక్షల్లో ఎంపికయిన ఈ మహిళా పైలట్‌ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారని ఆ అధికారి వెల్లడించారు.

అత్యంత సమర్థమైనవిగా పేరున్న రఫేల్‌ యుద్ధ విమానాలకు మహిళా పైలట్‌ ఎంపిక కావడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని పేరు వెల్తడించటానికి ఇష్టపడని ఐఏఎఫ్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. 2018లో యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన మొదటి భారతీయ మహిళా పైలట్‌గా అవనీ చతుర్వేది చరిత్ర సృష్టించారు. అప్పట్లో ఆమె మిగ్‌–21 బైసన్‌ విమానాన్ని సొంతంగా నడిపారు. యుద్ధ విమానాల కోసం ప్రయోగాత్మకంగా మహిళలను ఎంపిక చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు.. 2016 జూలైలో ఎంపికైన ముగ్గురు మహిళల బృందంలో ఈమె కూడా ఒకరు. మిగతా ఇద్దరు పైలట్లు భావనా కాంత్, మోహనా సింగ్‌. ప్రస్తుతం ఐఏఎఫ్‌లో 10 మంది మహిళా పైలట్లు, సహాయకులుగా మరో 18 మంది ఉన్నారు.

ఐఏఎఫ్‌లో మొత్తం మహిళా అధికారుల సంఖ్య 1,875. కాగా, రఫేల్‌ ఫైటర్‌ జెట్లు ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న భారత్, చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్‌లో విధుల్లో పాల్గొంటున్నాయి. ఫ్రాన్సులో తయారైన 5 రఫేల్‌ ఫైటర్‌ జెట్లు అంబాలా వైమానిక స్థావరం కేంద్రంగా పనిచేస్తున్న గోల్డెన్‌ యారోస్‌ స్క్వాడ్రన్‌లో ఈ నెల 10వ తేదీన అధికారికంగా చేరిన విషయం తెలిసిందే. మొట్టమొదటి సారిగా 1951లో అంబాలా వైమానిక స్థావరంలో ఏర్పాటయిన ఈ స్క్వాడ్రన్‌ పేరిట పలు రికార్డులు నమోదై ఉన్నాయి. 1955లో మొట్టమొదటి ఫైటర్‌ జెట్‌ డి హవిల్లాండ్‌ వాంపైర్‌ ఈ స్క్వాడ్రన్‌లోనే చేరింది. ఫ్రాన్సుతో కుదుర్చుకున్న రూ.59వేల కోట్ల ఒప్పందంలో భాగంగా జూలైలో మొదటి విడతగా ఐదు రఫేల్‌ యుద్ధ విమానాలు వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్‌ కల్లా రెండో విడతలో మరో నాలుగు, 2021 చివరి నాటికి మొత్తం 36 విమానాలు చేరనున్నాయి. రష్యా నుంచి సుఖోయ్‌ జెట్లను కొనుగోలు చేసిన 23 ఏళ్ల తర్వాత భారత్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు కుదుర్చుకున్న భారీ ఒప్పందమిది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top