కొత్త ప్రపంచం.. సరికొత్త జీవితం: షా ఫైజల్‌

Who Is Shah Faesal Journey MBBS Student To IAS And Political Leader - Sakshi

శ్రీనగర్‌: ‘‘అవాస్తవ, అభూత కల్పనలతో కశ్మీరీలను మభ్యపెట్టి వారు నిరాశపడేలా చేయడం నాకు ఇష్టం లేదు’’ అని ఇటీవల రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన షా ఫైజల్‌ వ్యాఖ్యానించారు. గతంలో జమ్మూ కశ్మీర్‌ ఐఏఎస్‌ అధికారిగా విధులు నిర్వర్తించిన ఆయన భవిష్యత్తులో కూడా ప్రజా సేవకే అంకితమవుతానని స్పష్టం చేశారు. విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, ఉద్యోగ కల్పనకై కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. కొత్త ప్రపంచంలో తాను సరికొత్త జీవితం ఆరంభించబోతున్నానని ప్రకటించిన షా ఫైజల్‌ అందుకు తగ్గట్టుగానే తన సోషల్‌ మీడియా అకౌంట్లలో తాను మెడికోనని మాత్రమే పేర్కొంటూ రాజకీయ జీవితం తాలూకు జ్ఞాపకాలు, ట్వీట్లను తొలగించారు. కాగా గతేడాది జ‌న‌వరిలో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన షా ఫైజల్‌.. మార్చి 21న  జ‌మ్ము క‌శ్మీర్ పీపుల్స్ మూమెంట్స్ పార్టీ స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. (కశ్మీర్‌ ఓ నివురుగప్పిన నిప్పు)

ఈ క్రమంలో 16 నెలల పాటు రాజకీయ నేతగా పలు అంశాలపై స్పందించిన ఆయన ఆగష్టు 10న అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు స‌మ‌యంలో క‌శ్మీర్‌లోని అనేక‌మంది కశ్మీరీ నేత‌ల‌తోపాటు ప్ర‌జా భ‌ద్ర‌త చ‌ట్టం కింద నిర్బంధంలో ఉన్న ఇటీవలే విడుదలయ్యారు. ఆ తర్వాత నెల రోజులకే ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో షా ఫైజల్‌ జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలు..

ఎవరీ షా ఫైజల్‌?
కశ్మీర్‌లోని కుప్వారాకు చెందిన షా ఫైజల్‌ 1983లో ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించారు. షాకు పందొమిదేళ్ల వయసున్నపుడు ఆయన తండ్రి గులాం రసూల్‌ షాను మిలిటెంట్లు కాల్చి చంపేశారు. ఈ విషయం గురించి షా గతంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కశ్మీర్‌లో లోయలో జరిగే రక్తపాతాన్ని కళ్లారా చూశాను. నా తండ్రిని ఉగ్రవాదులు హతమార్చినపుడు విషాదంలో మునిగిపోయాను. విద్యకు ప్రాధాన్యం ఇచ్చే నాన్న నాకు ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌ ఎక్కువగా బోధించే వారు’’అని గుర్తు చేసుకున్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా వైద్య(ఎంబీబీఎస్‌) విద్యనభ్యసించిన షా ఫైజల్‌.. 2010 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో టాప్‌ ర్యాంకు సాధించారు. తద్వారా ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్న తొలి కశ్మీరీగా నిలిచారు. జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వ అధికారికగా నియమితులయ్యారు.(ముర్ము రాజీనామాకు దారి తీసిన పరిస్థితులేమిటి?)

వివాదాల్లో చిక్కుకుని..
సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షా ఫైజల్‌ కశ్మీర్‌ లోయలో తరచూ జరిగే అత్యాచారాల గురించి ట్వీట్‌ చేసి వివాదంలో చిక్కుకున్నారు. దీంతో 2018లో కశ్మీర్‌ ప్రభుత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్టుమెంటు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో(‘అన్‌బికమింగ్‌ ఆఫ్‌ ఏ పబ్లిక్‌ సర్వెంట్‌’) నోటీసులు జారీ చేసింది. ఇక అప్పటి నుంచి ప్రతిసారి ఫైజల్‌ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో 2018లో విధుల నుంచి సెలవు తీసుకుని ఫుల్‌బ్రైట్‌ ఫెలోషిప్‌(ప్రోగ్రాం) కోసం హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌కు వెళ్లారు. ఆ తర్వాతే ఏడాదే అంటే 2019లో ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదొక ధిక్కరణ చర్య
ఈ సందర్భంగా ఫైజల్‌ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్‌ ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తూ తాను తీసుకున్న ఈ నిర్ణయం చిన్నపాటి ధిక్కరణ చర్య వంటిదని పేర్కొన్నారు. ఈ క్రమంలో 2019లో రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. స్వస్థలం కుప్వారాలో ఓ సమావేశం ఏర్పాటు చేసి పదేళ్ల పాటు ఐఏఎస్‌గా తాను గడిపిన జీవితం చెరసాల వంటిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మార్చి 21 జేకేపీఎం పేరిట రాజకీయ పార్టీని నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు. 

ఈ క్రమంలో ఆగష్టు 5న ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో  ఆర్టికల్‌ 370 రద్దు సమయంలో మోదీ సర్కారును విమర్శిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే ఇలా కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని కాలరాశారంటూ మండిపడ్డారు. అంతేగాక దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న మూక దాడులు, హత్యలపై నిరసన వ్యక్తం చేశారు. భావ ప్రకటనా స్వేచ్చను అణచివేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దేశంలో అసహనం పెరిగిపోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లోని అనేక‌మంది నేత‌ల‌తోపాటు షాను కూడా ప్ర‌జా భ‌ద్ర‌త చ‌ట్టం కింద నిర్బంధించారు. 2020 జూలైలో ఆయ‌న‌ విడుద‌లయ్యారు.  

నేనెందుకు జీవితం నాశనం చేసుకోవాలి?
ఈ క్రమంలో సోమవారం రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటన విడుదల చేసిన షా ఫైజల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చివరాఖరికి నాకు అర్థమైంది ఏంటంటే మనం ఒంటరిగా మిగిలిపోయినపుడు కుటుంబం తప్ప మరెవరూ మనకోసం నిలబడరు. నిర్బంధంలో ఉన్నపుడు నాకు ఈ విషయం స్పష్టంగా తెలిసింది. నా గురించి పట్టించుకోని వాళ్ల కోసం నేనెందుకు నా జీవితం నాశనం చేసుకోవాలి. నిజంగా ఆ కఠిన సమయం జీవితాన్ని మరో కోణం నుంచే చూసేలా నాకు సాయం చేసింది’’అని వేదాంత ధోరణి అవలంభించారు. అయితే జమ్మూ కశ్మీర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్ల జాబితాలో ఇంతవరకు ఫైజల్‌ పేరును తొలగించకపోవడంతో ఆయన మళ్లీ పాలనారంగంలోకి వస్తారా లేదా వైద్యుడిగా సేవలు అందిస్తారా? ప్రజాసేవ చేస్తానన్న తన మాటలు ఎలా నిలబెట్టుకుంటారన్న విషయం ఆసక్తికరంగా మారింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top