వాజ్‌పేయి చొరవ వల్లే.. అది ఇప్పటికీ అమలు! ఇప్పుడు దిగ్గజాల సరసన నిర్మలమ్మ

when Vajpayee advanced budget to morning session - Sakshi

ఇవాళ కేంద్ర బడ్జెట్‌ ప్రజల ముందుకు వచ్చింది. ఎన్నికల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. గతంలో కంటే కాస్తలో కాస్త జనాలకు ఊరట ఇచ్చే ప్రయత్నమే చేసింది కేంద్రం. అయితే అటల్‌ బిహారీ వాజ్‌పేయి దేశ ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకున్న ఓ చారిత్రక నిర్ణయం ఇప్పటికీ బడ్జెట్‌ సందర్భంలో ప్రస్తావనకు వస్తుంటుంది. అదేంటో తెలుసా?.. 

ఈయన హయాంలోనే బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు మార్చారు. ఫిబ్రవరి చివరి తేదీన సాయంత్రం వేళలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం బ్రిటిష్‌ కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. కానీ,  వాజ్‌పేయి ప్రభుత్వం ఆ పద్ధతిని మార్చేసింది. ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్‌ సిన్హా.. 1999లోనే ఉదయం 11 గంటల ప్రాంతంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడాన్ని మొదలుపెట్టారు.  అలాగే ఫిబ్రవరి చివరి తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టే మరో సంప్రదాయానికి 2017లో పుల్‌స్టాప్‌ పడింది. 

మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్‌ జైట్లీ.. ఫిబ్రవరి చివరి తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తారీఖునే బడ్జెట్‌ ప్రవేశపెట్టే ఆనవాయితీని మొదలుపెట్టారు. 

స్వాతంత్య్ర భారతదేశంలో వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌ నిలిచారు. ఈ జాబితాలో అరుణ్‌ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్‌ సిన్హా, మన్మోహన్‌ సింగ్‌, మొరార్జీ దేశాయ్‌ ఉన్నారు. మోదీ 2.0 టీంలో  2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీతారామన్‌ వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెడుతూ వస్తున్నారు. 

దేశ చరిత్రలో అత్యధిక సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వ్యక్తిగా మొరార్జీ దేశాయ్‌ రికార్డు సృష్టించారు. మొత్తం 10 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారాయన. 1962-69 మధ్య.. ఆయన చేతుల మీద కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆ తర్వాతి ప్లేస్‌లో పీ చిదంబరరం, ప్రణబ్‌ ముఖర్జీ(8), యశ్వంత్‌ సిన్హా(8), మన్మోహన్‌ సింగ్‌(6) ఈ జాబితాలో ఉన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top