‘గ్రాప్‌- 3’ అంటే ఏమిటి? ‍ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది? | Sakshi
Sakshi News home page

‘గ్రాప్‌- 3’ అంటే ఏమిటి? ‍ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది?

Published Sun, Nov 5 2023 7:19 AM

What is Grap-3 Why Government Implemented - Sakshi

దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే తాజాగా గ్రాప్- 3ని కూడా అమలులోకి తీసుకువచ్చారు. దేశ రాజధానిలో కాలుష్య స్థాయి ‘తీవ్రమైన’ కేటగిరీకి చేరుకోవడంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పలు నిర్మాణ పనులను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి  ఆదేశాల మేరకు నిలిపివేశారు. డీజిల్‌తో నడిచే ట్రక్కులను దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) ఉత్తర్వులు జారీ చేసింది.

కాలుష్య నియంత్రణలో గ్రాప్‌-3 అనేది మూడవ దశలో భాగం. ఇది చలికాలంలో ఢిల్లీ అంతటా అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించిన వాయు కాలుష్య నిర్వహణ వ్యూహం. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 402గా ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా కాలుష్య స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత పరిస్థితిని పరిశీలించడానికి జరిగిన సమావేశంలో ఈ ప్రాంతంలోని కాలుష్యాన్ని పరిష్కరించడానికి చర్యలను రూపొందించే బాధ్యత చేపట్టిన సీఏక్యూఎం ఏజెన్సీ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు.

గ్రాప్‌ అనేది నాలుగు దశలుగా విభజించిన విధానం. వీటిని ‘పూర్’ (ఏక్యూఐ 201-300), ‘వెరీ పూర్’ (ఏక్యూఐ 301-400), ‘తీవ్రమైన’ (ఏక్యూఐ 401-450), ‘మరింత తీవ్రమైన’ (ఏక్యూఐ >450)వర్గాలుగా పేర్కొన్నారు. గ్రాప్‌ స్టేజ్-3లో కీలకమైన ప్రభుత్వ ప్రాజెక్టులు, ముఖ్యమైన మైనింగ్, స్టోన్ బ్రేకింగ్ కార్యకలాపాలు మినహా అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తారు. ఢిల్లీకి బయట రిజిస్టర్ అయిన వాణిజ్య వాహనాలతో పాటు డీజిల్‌తో నడిచే ట్రక్కులు, మధ్యస్థ, భారీ కంటెయినర్‌ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని కూడా నిషేధించారు. 
ఇది కూడా చదవండి: కాలుష్య భూతం: టెక్‌ కంపెనీల కీలక చర్యలు

Advertisement

తప్పక చదవండి

Advertisement