Viral: పెద్దలు ఒప్పుకోలేదని.. ప్రేమకు వేదికైన కళాశాలలోనే పెళ్లి చేసుకున్న జంట

Viral: Amid Youth Festival Couple Ties Knot On Maharaja Campus - Sakshi

కొచ్చి: చదువుకున్న చోటే పూర్వ విద్యార్థుల వివాహానికి వేదికైంది. స్నేహితులే కుటుంబం, బంధువులుగా మారారు. ప్రేమకు వేదికైన కళాశాలలోనే వివాహ బంధంతో ఒక్కటయ్యారు.  వేలాదిమంది విద్యార్థుల సమక్షంలో దండలు మార్చుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. 

ఈ ప్రత్యేక వివాహం కేరళ రాష్ట్రంలో బుధవారం జరిగింది. మహాత్మా గాంధీ యూనివర్శిటీ యూత్ ఫెస్టివల్ సందర్భంగా ఓ ప్రేమ జంట వినూత్నంగా పెళ్లి చేసుకుని వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది.

ఎర్నాకుళంలోని మట్టంచెరి ప్రాంతానికి చెందిన కేకే నదీమ్​, పనంగాడ్‌కు చెందిన సీఆర్​ కృపా అనే యువతీ యువకులు మహారాజా కాలేజ్‌లో (2014- 17) డిగ్రీ చదువుకున్నారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిరుగురించింది. చదువులు పూర్తి అయిన తరువాత కూడా వీరి ప్రేమ కొనసాగింది.

అయితే ఇద్దరి సామాజిక నేపథ్యాలు వేరు కావడంతో వీరి ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. చివరికి నదీమ్‌ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నప్పటికీ.. కృప తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయినా వీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వారి ప్రేమకు వేదికైన కళాశాలలోనే ఒక్కటవ్వాలనుకున్నారు. అదే సమయంలో కాలేజ్‌లో యూత్‌ ఫెస్టివల్‌ జరుగుతుండటంతో అక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

జనవరి 8వ తేదీన తమ పెళ్లిని రిజిస్ట్రేషన్‌ చేసుకుని అనంతరం కళాశాలకు తిరిగి వచ్చారు. వేలాది మంది విద్యార్థుల సమక్షంలో కాలేజీ సెంటర్‌ సర్కిల్‌లో ఉన్న దేవత విగ్రహం ముందు ఇద్దరూ దండలు మార్చుకున్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. నూతన జంటకు స్నేహితులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా నదీమ్‌ ప్రేవేటు కంపెనీలో పనిచేస్తుండగా.. కృప న్యాయ విద్యనభ్యసిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top