‘ఈవీఎం’ ఆరోపణలు.. ఈసీ కీలక నిర్ణయం

Varanasi Official Suspended Over EVM Protocol - Sakshi

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపర్‌ చేశారని బుధవారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఆరోపణలకు దిగింది. ‘ ట్యాంపరింగ్‌ను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలొచ్చాయా? ఈ విషయంలో ఈసీ వివరణ ఇవ్వాల్సిందే’ అని ఎస్పీ ట్వీట్‌చేసింది. దీంతో మంగళవారం రాత్రి ఈవీఎంలను తరలించిన ఘటనలో వారణాసి అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ నళినికాంత్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేశారు.

అయితే.. యూపీ పోలింగ్‌లో వాడిన ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసి తరలిస్తున్నారంటూ ఒక వీడియోను ఎస్పీ బహిర్గతం చేయడం తెల్సిందే. ఈ వివాదంపై ఎన్నికల అధికారులు గురువారం స్పష్టతనిచ్చారు. ‘ అవి పోలింగ్‌లో వాడినవి కాదు. బుధవారం శిక్షణ కోసం వాడటం కోసం తీసుకెళ్తున్నారు. బుధవారం ఉదయం తరలించాల్సి ఉండగా ముందస్తు అనుమతిలేకుండా మంగళవారం రాత్రే తరలించారు. తరలింపులో నిర్లక్ష్యం వహించిన నళినికాంత్‌ సింగ్‌ను సస్పెండ్‌చేశాం’ అని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ కౌశల్‌ రాజ్‌ శర్మ గురువారం చెప్పారు. 

ఈ అంశంలో ఈసీకి ఫిర్యాదుచేస్తామని, కోర్టుకెళ్తామని ఎస్పీ ప్రకటించింది. కాగా, ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారిని మీరట్‌లో ప్రత్యేకాధికారిగా, బిహార్‌ ముఖ్య ఎన్నికల అధికారిని వారణాసిలో ప్రత్యేకాధికారిగా ఈసీ నియమించింది. సొంత వాహనంలోని ఓ పెట్టెలో బ్యాలెట్‌ పేపర్లు లభించడంతో సోన్‌భద్ర జిల్లా రిటర్నింగ్‌ అధికారి రమేశ్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించారు. మున్సిపాలిటీ చెత్తకుప్పలో బ్యాలెట్‌ బాక్స్‌లు, ఎన్నికల సామగ్రి లభించడంతో బరేలీ జిల్లా అదనపు ఎలక్షన్‌ ఆఫీసర్‌ వీకే సింగ్‌ను సస్పెండ్‌ చేశారు.

చదవండి: పంచ తంత్రం.. గెలుపు ఎవరిదో?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top