
న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీ క్యాటరింగ్ సిబ్బంది మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించిన వీడియో వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఖజురహో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని క్యాటరింగ్ సిబ్బంది పరస్పరం కొట్టుకున్నారు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు.
క్యాటరింగ్ సిబ్బంది కొట్లాటకు సంబంధించిన 30 సెకన్ల ఈ వీడియోను చూస్తే, ఈ ఘటన ప్లాట్‌ఫారమ్ నంబర్ 7లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు ప్యాంట్రీ సిబ్బంది(పురుషులు) పరస్పరం అందిన వస్తువులు విసురుకోవడం, బెల్టులతో కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రైలు లోపల వాటర్ బాక్స్ ఉంచడం విషయంపై తలెత్తిన వివాదం భౌతిక ఘర్షణలకు దారితీసింది.
IRCTC staffers serving onboard Vande Bharat settle an altercation with dustbin, belt and punches at Nizamuddin station in Delhi. pic.twitter.com/tldenRsRMz
— Piyush Rai (@Benarasiyaa) October 17, 2025
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియో ‘ఎక్స్’ ప్లాట్‌ఫారంలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన కొందరు యూజర్లు దీనిని ‘బాగ్‌పత్ యుద్ధం’తో పోల్చారు. ఈ ఘటన అనంతరం నలుగురు సిబ్బందిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎప్)తదుపరి దర్యాప్తు కోసం అదుపులోకి తీసుకుంది. వారి ఐడీ కార్డులను రద్దు చేశారు.