UPSC Ranker: భర్త, అత్త వేధింపులను తట్టుకుని.. ‘శివాంగి గోయల్‌’ ఎందరికో స్పూర్తి

UPSC Ranker Shivangi Goyal Facing Domestic Abuse - Sakshi

న్యూఢిల్లీ: కట్నం వేధింపులతో అత్తింటి నుంచి పుట్టింటికి చేరుకున్న ఆమె తన కల సాకారం చేసుకోవడమే కాక గృహహింస బాధితురాళ్లకు ఆదర్శంగా నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌ జిల్లాకు చెందిన శివాంగి గోయల్‌ తాజాగా వెలువడిన యూపీఎస్‌సీ ఫలితాల్లో ఆలిండియా 177వ ర్యాంకు సాధించారు. 

ఆమెకు పెళ్లై, ఏడేళ్ల వయసు కుమార్తె ఉంది. భర్త, అత్తింటి వారు కట్నం కోసం పెడుతున్న వేధింపులతో విసిగి పుట్టింటికి చేరుకున్నారు. ప్రస్తుతం విడాకుల కేసు నడుస్తోంది. ‘‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అంటూ నాన్న అభయహస్తమిచ్చారు. యూపీఎస్‌సీకి మరోసారి ఎందుకు సిద్ధం కాకూడదని అప్పుడే ఆలోచించా’’ అని శివాంగి చెప్పారు. ‘‘స్కూల్లో చదివే రోజుల్లోనే యూపీఎస్‌సీకి ప్రిపేర్‌ కావాలంటూ ప్రిన్సిపాల్‌ సలహా ఇచ్చారు. అప్పటి నుంచే ఐఏఎస్‌ కావాలని కలలుగనేదాన్ని. అదే నా లక్ష్యంగా ఉండేది’’ అని అన్నారు.

‘‘రెండుసార్లు యూపీఎస్‌సీ పరీక్ష రాశాక పెళ్లయింది. అత్తింటి వారి వేధింపులతో కూతురితో పుట్టింటికి వచ్చేశా’’ అని అన్నారు. ‘‘చిన్ననాటి కల నిజం చేసుకోవాలనే పట్టుదలతో ఎన్ని అవాంతరాలున్నా ప్రిపరేషన్‌పైనే దృష్టిపెట్టా. సోషియాలజీ సబ్జెక్టుగా సొంతంగా చదువుకుని పరీక్షకు ప్రిపేరయ్యా. అనుకున్నది సాధించా’’ అన్నారు.

 ‘‘నా తల్లిదండ్రులు, కుమార్తె రైనా సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైంది. నేటి మహిళలు అత్తింట్లో జరగరానిది జరిగితే, భయపడకూడదు. ధైర్యంగా నిలబడి సొంత కాళ్లపై నిలబడాలి. ఇదే వారికి నేనిచ్చే సలహా. కావాలనుకుంటే ఏదైనా చేయగలరు. కష్టపడి చదువుకుంటే ఐఏఎస్‌ కూడా అసాధ్యమేమీ కాదు’’ అన్నారామె. శివాంగి తండ్రి రాజేశ్‌ గోయెల్‌ వ్యాపారి కాగా, తల్లి సామాన్య గృహిణి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top