వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు
సుప్రీంకోర్టుకు తెలిపిన యూపీఎస్‌సీ
సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నట్లు వెల్లడి
న్యూఢిల్లీ: తాము నిర్వహించే వివిధ పరీక్షలకు హాజరయ్యే దృష్టి లోపం కలిగిన అభ్యర్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) సంకల్పించింది. ఈ విషయాన్ని శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దృష్టిలోపమున్న వారు కూడా తాము నిర్వహించే పరీక్షల్లో సులువుగా పాల్గొనేందుకు వీలుగా స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామంది.
అయితే, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మౌలిక వనరులు తమ వద్ద అందుబాటులో లేవని పేర్కొంది. ‘పరీక్షలను సురక్షితమైన పద్ధతిలో నిర్వహించడానికి వివిధ కేంద్రాలలో సాధ్యాసాధ్యాలను గుర్తించాక, సరైన మౌలిక సదుపాయాలు సాఫ్ట్‌వేర్ లభ్యత నిర్ధారణ అయిన వెంటనే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాం’అని పేర్కొంది.
యూపీఎస్‌సీ నిర్వహించే పరీక్షలను అంధత్వం/పాక్షిక అంధత్వంతో బాధపడే వారు రాసేందుకు అవకాశం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈ మేరకు అదనపు అఫిడవిట్ వేసింది. ‘మిషన్ యాక్సెసబిలిటీ’అనే సంస్థ వేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. దేశ వ్యాప్తంగా నిర్వహించే వివిధ పరీక్షల కోసం తమకు సొంతంగా ఎలాంటి మౌలిక వనరులు లేవని ఈ సందర్భంగా యూపీఎస్‌సీ పేర్కొంది.
దృష్టి లోపం కలిగిన వారి కోసం ప్రత్యేకంగా స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్‌తో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఉన్న సంస్థల వివరాలు తెలిపాలని రాష్ట్రాలను జూలైలోనే కోరామని, ఇదే విషయమై వివిధ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో ప్రత్యేకంగా వర్చువల్ సమావేశాలు నిర్వహించామని యూపీఎస్‌సీ తన అఫిడవిట్‌లో వివరించింది. ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపట్టేందుకు కనీసం ఏడాది పట్టొచ్చని యూపీఎస్‌సీ పేర్కొంది.
డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీ(ఎన్‌ఐఈపీవీడీ)తోనూ సంప్రదింపులు జరుపుతున్నామంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ 9 ప్రాంతీయ కార్యాలయాల్లో దృష్టిలోపం కలిగిన వారికి పరీక్షలు నిర్వహించేందుకు ఈ సంస్థ అంగీకారం తెలిపిందని పేర్కొంది.యూపీఎస్‌సీ అఫిడవిట్‌ను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు తెలిపింది.


