breaking news
screen reader
-
దృష్టి లోపం వారికి ‘స్క్రీన్ రీడర్’
న్యూఢిల్లీ: తాము నిర్వహించే వివిధ పరీక్షలకు హాజరయ్యే దృష్టి లోపం కలిగిన అభ్యర్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సంకల్పించింది. ఈ విషయాన్ని శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దృష్టిలోపమున్న వారు కూడా తాము నిర్వహించే పరీక్షల్లో సులువుగా పాల్గొనేందుకు వీలుగా స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామంది. అయితే, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మౌలిక వనరులు తమ వద్ద అందుబాటులో లేవని పేర్కొంది. ‘పరీక్షలను సురక్షితమైన పద్ధతిలో నిర్వహించడానికి వివిధ కేంద్రాలలో సాధ్యాసాధ్యాలను గుర్తించాక, సరైన మౌలిక సదుపాయాలు సాఫ్ట్వేర్ లభ్యత నిర్ధారణ అయిన వెంటనే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాం’అని పేర్కొంది. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలను అంధత్వం/పాక్షిక అంధత్వంతో బాధపడే వారు రాసేందుకు అవకాశం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈ మేరకు అదనపు అఫిడవిట్ వేసింది. ‘మిషన్ యాక్సెసబిలిటీ’అనే సంస్థ వేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. దేశ వ్యాప్తంగా నిర్వహించే వివిధ పరీక్షల కోసం తమకు సొంతంగా ఎలాంటి మౌలిక వనరులు లేవని ఈ సందర్భంగా యూపీఎస్సీ పేర్కొంది. దృష్టి లోపం కలిగిన వారి కోసం ప్రత్యేకంగా స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్‌తో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఉన్న సంస్థల వివరాలు తెలిపాలని రాష్ట్రాలను జూలైలోనే కోరామని, ఇదే విషయమై వివిధ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో ప్రత్యేకంగా వర్చువల్ సమావేశాలు నిర్వహించామని యూపీఎస్సీ తన అఫిడవిట్లో వివరించింది. ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపట్టేందుకు కనీసం ఏడాది పట్టొచ్చని యూపీఎస్సీ పేర్కొంది. డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీ(ఎన్ఐఈపీవీడీ)తోనూ సంప్రదింపులు జరుపుతున్నామంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ 9 ప్రాంతీయ కార్యాలయాల్లో దృష్టిలోపం కలిగిన వారికి పరీక్షలు నిర్వహించేందుకు ఈ సంస్థ అంగీకారం తెలిపిందని పేర్కొంది.యూపీఎస్సీ అఫిడవిట్‌ను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు తెలిపింది. -
నెటిజన్లకి అంధుల విజ్ఞప్తి
ఓ మంచి పనికి సహకారం కావాలని, తమకు నెటిజన్లు అండగా నిలవాలని కోరుతూ అంధులు విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని అంధులు ఎదుర్కొంటున్న ఓ సమస్యను, అందరం కలిస్తే చాలా సులువుగా పరిష్కరించవచ్చు. ఆధునిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమంతా మన చేతిలో ఉన్నట్టే. ఈ స్మార్ట్ ఫోన్‌ని కళ్లు మూసుకొని కూడా కొన్ని సాఫ్ట్వేర్ల సహాయంతో అవలీలగా ఉపయోగించవచ్చు. వీటిలో వాయిస్ ఓవర్ అనే స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్ ఒకటి. ఇది ప్రతి ఆపిల్ ఐఓస్ ప్రాడక్ట్‌లలో అందుబాటులో ఉంది. ఈ వాయిస్ ఆఫ్షన్‌ని ఆన్ చేస్తే స్క్రీన్ మీద కనిపించే ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని స్పష్టంగా పైకి చదివి వినిపిస్తుంది. దీని సహాయంతో అంధత్వాన్ని అతిక్రమించి ఇతరుల మీద ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకుంటూ వ్యక్తిగత జీవితంలో ఉద్యోగ రంగంలో అంధులు అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అంధులు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవడానికి తెలుగు వారందరి సహకారాన్ని కోరుతున్నారు. ఈ వాయిస్ ఓవర్ సహాయంతో కొన్ని ప్రాంతీయ భాషల్లో లభించే సమాచారాన్ని అంధులు చదవలేకపోతున్నారు. వీటిలో తెలుగు భాష కూడా ఉంది. దీంతో స్క్రీన్ పైన కనిపించే తెలుగు పదాలను అంధులు చదవలేకపోతున్నారు. చేంజ్ డాట్ ఓఆర్జీ వెబ్ సైట్ సహాయంతో తమ సమస్యను ఆపిల్ దృష్టికి తీసుకువెళ్లడానికి అంధులు ఓ దరఖాస్తు చేశారు. అయితే ఈ పిటిషన్ ఆపిల్ స్వీకరించాలంటే కనీసం 5000 మంది ఈ పిటిషన్‌కు మద్దతుగా సైన్ చేయాల్సి ఉంటుంది. మద్దతు తెలపడానికి కేవలం అంధులే కావాల్సిన అవసరం లేదు. వారి సమస్యకు పరిష్కారం అవసరం అని భావించే ఎవరైనా ఈ పిటిషన్‌కు మద్దతు తెలిపి అంధుల ఆత్మస్థైర్యానికి అండగా నిలిచే అవకాశం ఉంది. కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి మొదటిపేరు, చివరి పేరు, ఈ మెయిల్ ఐడీ ఇచ్చి సైన్ బటన్ ప్రెస్ చేస్తే చాలు. https://www.change.org/p/apple-appeal-to-add-telugu-text-to-speech-for-blind-to-read-telugu-in-voice-over?recruiter=770398474&utm_source=share_petition&utm_medium=sms&utm_campaign=share_petition&utm_term=share_petition మరింత సమాచారం కోసం కింది వీడియోను వీక్షించండి


