నడి రోడ్డుపై మహిళల ఫ్యాషన్‌ షో.. ఎందుకో తెలుసా?

Unique Protest Womens Catwalk On Road In Bhopal  - Sakshi

భోపాల్‌లో మహిళల విన్నూత్న నిరసన

అధికారులకు బుద్ధి చెప్పేలా చర్య

గుంతలమయమైన రోడ్డుతో ఇబ్బందులు

భోపాల్‌: మహిళలు నడిరోడ్డుపై.. నీటి కుంటల వద్ద హొయలొలుకుతూ క్యాట్‌ వాక్‌ చేశారు. రోడ్డుపై ఫ్యాషన్‌ షో మొదలుపెట్టడం మధ్యప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. వారు అలా ఎందుకు చేశారో తెలుసా..? తమ ప్రాంతంలో రోడ్లు బాగా లేవని చెప్పేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు మహిళలు తెలిపారు. రోడ్డుపై గుంతలతో తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పేందుకు.. అధికారుల నిర్లక్ష్యం చూపించేందుకు తాము ఈ తరహా ఆందోళన చేసినట్లు వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
చదవండి: పదో తరగతి పాసయిన మాజీ సీఎం.. దాంతోపాటు ఇంటర్‌ కూడా 

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని హోషంగాబాద్‌, ధనిశ్‌నగర్‌లో రోడ్లు బాగా లేవు. గుంతలు తేలడంతో రోడ్డు ప్రమాదకరంగా మారింది. దీనికి తోడు వర్షాలకు నీరు నిలిచి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టింపు లేకపోవడంతో నారీమణులు కొంగు బిగించి రోడ్డు బాట పట్టారు. ధర్నాలు, కార్యాలయాల ముట్టడితో పని లేదని విన్నూత్నంగా చేద్దామని ఫ్యాషన్‌ షో ప్లాన్‌ వేశారు. అనుకున్నదే తడువుగా ధనీశ్‌నగర్‌ మహిళలు బయటకు వచ్చారు. 

రోడ్డుపై గుంతలు ఉన్న చోట.. నీరు నిలిచిన చోట ప్రత్యక్షమయ్యారు. ఫ్యాషన్‌ షో మాదిరి క్యాట్‌ వాక్‌ చేస్తూ నడిచారు. బురదలోనే నడిచారు. రోడ్డు మరమ్మతులు వెంటనే చేయాలని తమ అందచందాలతో డిమాండ్‌ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో తాము ఈ విధంగా నిరసన చేపట్టినట్లు మహిళలు తెలిపారు. రోడ్డుపై ప్రమాదకరంగా గుంతలు తయారయ్యాయని వాపోయారు. మున్సిపల్‌ అధికారులు పన్నుల వసూళ్లపై చూపించే శ్రద్ధ ప్రజల సమస్యలను పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం చెల్లించే పన్నులను ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ మహిళల విన్నూత్న నిరసన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top