రైల్వే నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తాం | Union Minister Kishan Reddy Meets Railway Minister Ashwini Vaishnaw | Sakshi
Sakshi News home page

రైల్వే నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తాం

May 22 2026 4:29 AM | Updated on May 22 2026 4:29 AM

Union Minister Kishan Reddy Meets Railway Minister Ashwini Vaishnaw

అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

రైల్వే మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

రాష్ట్రంలో 42 ప్రధాన స్టేషన్ల 

అభివృద్ధిపై సమగ్ర చర్చ 

కొత్త లైన్లు, హైస్పీడ్‌ రైల్‌ కారిడార్ల పురోగతిపై సమీక్ష

సాక్షి, న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, మౌలిక వసతుల కల్పనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పారు. గురువారం ఢిల్లీలోని రైల్వే భవన్‌లో అశ్వినీ వైష్ణవ్‌తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్లు, ఎలక్ట్రిఫికేషన్‌ పనుల పురోగతిపై ఇరువురు మంత్రులు సుదీర్ఘంగా సమీక్షించారు. తెలంగాణలోని 42 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు సంబంధించి ఈ సమావేశంలో వివరంగా చర్చించారు. ఈ స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించేందుకు తీసుకుంటున్న చర్యలను రైల్వే మంత్రి వివరించారు. 

ఎంఎంటీఎస్‌పై త్వరలో ప్రత్యేక సమావేశం..  
హైదరాబాద్‌ మహానగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు, ఉద్యోగులకు అత్యంత కీలకమైన రవాణా సాధనంగా ఉన్న ఎంఎంటీఎస్‌ సేవలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎంఎంటీఎస్‌ రైళ్ల వేళలను క్రమబద్ధీకరించాలని, ప్రయాణికులకు సౌకర్యాలను మరింత మెరుగుపరిచేలా చొరవ తీసుకోవాలని ఆయన రైల్వే మంత్రిని కోరారు. కిషన్‌రెడ్డి విజ్ఞప్తిపై అశ్వినీ వైష్ణవ్‌ సానుకూలంగా స్పందించారు.

ఈ అంశంపై త్వరలోనే అధికారులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ పనుల పురోగతిపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement