
మహిళను హత్య చేసి ముక్కలు చేసిన కేసు..
తన భార్యను చెడుతోవ పట్టిస్తోందని దంతవైద్యుని పగ
తుమకూరులో వీడిన మిస్టరీ
కర్ణాటక: జిల్లాతో పాటు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి అనేకచోట్ల విసిరివేసిన భయానక హత్యాకాండలో మిస్టరీ వీడింది. సొంత అల్లుడే అత్తను అంతమొందించాడని తేలింది. తుమకూరు సిటీ కువెంపు నగరలో నివాసం ఉంటున్న ఆమె అల్లుడు, దంత వైద్యుడు డాక్టర్. ఎస్.రామచంద్రయ్య (47) సూత్రధారి కాగా, ఊర్డిగెరె సమీపంలో కళ్లహళ్ళివాసి సతీష్ కే.ఎన్.(38), కిరణ్ కే.ఎస్. (32) అనే ఇతర నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కేవీ అశోక్ మీడియాతో తెలిపారు.
ఏం జరిగిందంటే
వివరాలు... తుమకూరు తాలూకాలోని బెళ్ళావి గ్రామానికి చెందిన బసవరాజు భార్య లక్ష్మీదేవమ్మ (42) ఈ నెల 3వ తేదీన కూతురి తేజస్వినిని చూడాలని తుమకూరుకు వచ్చింది. ఆ తరువాత ఆమె ఆచూకీ లేదు. కూతురి ఇంటికి వచ్చిన అత్తను అల్లుడు, ఇతర దుండగులు కిడ్నాప్‌చేశారు. హత్య చేసి సుమారు 10 ముక్కలుగా చేసి చింపుగానహళ్లి పరిసరాలలో పడేశారు. గ్రామస్తుల సమాచారం ఎస్పీ, పోలీసులు గాలింపు జరిపి శరీర భాగాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీదేవమ్మగా భర్త బసవరాజు, పిల్లలు గుర్తించారు. బంధువులను పిలిచి విచారణ చేసే సమయంలో అల్లుడు, డెంటిస్టు రామచంద్ర కనిపించలేదు.
ధర్మస్థలలో అల్లుడు
అల్లుడు ధర్మస్థలకు వెళ్లాడు. పోలీసులు అక్కడికే వెళ్లి నిర్బంధించి కొరటిగెరె స్టేషన్‌కు వచ్చి గట్టిగా విచారించగా జరిగింది వివరించాడు. తన భార్యను చెడుదారిలో తీసుకెళ్లేందుకు ఒత్తిడి చేసిందని, అందుకే హత్య చేశానని చెప్పాడు. శరీరాన్ని ముక్కలు చేసి 10 చోట్ల పడేశామని తెలిపాడు. కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కేసులో ఇంకా దర్యాప్తు సాగుతోందని ఎస్పీ తెలిపారు.