
ఖాట్మండు: నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారి అదుపు తప్పాయి. ఆగ్రహంతో రగిలిపోయిన యువత ఏకంగా ప్రధానమంత్రి కేపీ ఓలీ అధికారిక నివాసానికే నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ దేశాన్ని చుట్టుముట్టిన నిరసనల క్రమంలో మరో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల సమయంలో రాజధాని ఖాట్మండులోని ఓ హోటల్‌కు నిరసనకారులు నిప్పుపెట్టారు. దీంతో ఓ భారతీయ జంట.. మంటల నుంచి తప్పించుకునేందుకు నాలుగో అంతస్తు విండో నుంచి దూకారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
మృతి చెందిన మహిళను డెహ్రాడూన్ చెందిన 55 ఏళ్ల రాజేష్ దేవి గోలాగా గుర్తించారు. పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించడానికి ఆమె తన భర్త రామ్‌వీర్ సింగ్ గోలాతో కలిసి ఖాట్మండుకు వెళ్లారు. రామ్‌వీర్ వృత్తిరీత్యా ట్రాన్స్‌పోర్టర్. గురువారం ఈ దంపతులు హిల్టన్ హోటల్‌లో బస చేశారు. నిరసనకారులు ఆ భవనానికి నిప్పంటించడంతో తప్పించుకునే క్రమంలో భవనం నుంచి దూకారు. మరోవైపు నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తిరుగు ప్రయాణపర్వం మొదలైంది. పలు మార్గాల్లో పలు రాష్ట్రాల ప్రజలు వెనుతిరిగి వస్తున్నారు.
కాగా, నేపాల్‌లో ఓవైపు ఉద్యమం, మరోవైపు ప్రభుత్వం కుప్పకూలడంతో శాంతిభద్రతలు కట్టుతప్పి ఖైదీలు చెలరేగిపోయారు. దేశవ్యాప్తంగా దాదాపు 25 కారాగారాల నుంచి 15 వేల మంది ఖైదీలు జైలు గదులు బద్దలుకొట్టిమరీ బయటపడ్డారు. పరారై బయటికొచ్చి స్వేచ్ఛావాయువులు పీల్చారు. నేరస్తుల పరారీతో అప్రమత్తమైన సైన్యం పలుచోట్ల ఖైదీలను వెంటబడిమరీ పట్టుకుంది. కొన్ని చోట్ల జైలు సిబ్బందిపై ఖైదీలు ఎదురుతిరిగారు. మాధేశ్ ప్రావిన్సులోని రామెఛాప్ జిల్లా కారాగార కేంద్రంలో గురువారం ఉదయం ఒక్కసారిగా ఖైదీలు జైలుసిబ్బందితో ఘర్షణకు దిగారు.
జైలు గోడను బద్దలుకొట్టేందుకు ఖైదీలు గ్యాస్ సిలిండర్‌ను పేల్చేశారు. దీంతో ఘర్షణ మొదలైంది. పారిపోయేందుకు ప్రయతి్నంచిన వారిని నిలువరించేందుకు సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఖైదీలు మరణించారు. పలువురు గాయపడ్డారు. దీంతో సోమవారం మొదలైన హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా సంభవించిన మరణాల సంఖ్య గురువారానికి 34కు పెరిగింది. 1,338 మందికి పైగా గాయాలపాలయ్యారు.
కల్లోల నేపాల్ నుంచి బయటపడే దురుద్దేశంతో ఇప్పటికే జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలు కొందరు ఏకంగా దేశందాటి పారిపోయేందుకు విఫలయత్నంచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బయిర్‌గనియా చెక్‌పోస్ట్ సమీప ప్రాంతం గుండా భారత్‌లోకి చొరబడేందుకు యతి్నంచిన 13 మంది నేపాల్ ఖైదీలను భారత బలగాలైన సశస్త్ర సీమా బల్(ఎస్‌ఎస్‌బీ) విజయవంతంగా అడ్డుకుంది. సరిహద్దు సమీపంలోని రౌతహాత్ జిల్లా కారాగార కేంద్రం నుంచి ఈ ఖైదీలు పారిపోయారని ఎస్‌ఎస్‌బీ గుర్తించింది.
నిబంధనల ప్రకారం వారందరినీ నేపాల్ పోలీసులకు ఎస్‌ఎస్‌బీ సైనికులు అప్పగించారు. ఇప్పటిదాకా జైళ్ల నుంచి పారిపోయి సరిహద్దుదాకా చేరుకున్న దాదాపు 60 మంది నేపాలీ ఖైదీలు, ఒక బంగ్లాదేశ్ జాతీయుడిని అదుపులోకి తీసుకుని నేపాల్ పోలీసులకు అప్పగించామని ఎస్‌ఎస్‌బీ అధికారి వెల్లడించారు.