2028 ఆగస్ట్ 31వ తేదీలోగా పాసవ్వాల్సిందే
గడువు పొడిగించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఉత్తీర్ణతకు గడువును సుప్రీంకోర్టు మరోసారి పెంచింది. సర్వీసులో ఉన్న టీచర్లు టెట్ పాసవ్వడం తప్పనిసరని స్పష్టం చేసింది. సర్వీసులో కొనసాగాలంటే 2028 ఆగస్ట్ 31వ తేదీలోగా ఉత్తీర్ణత సాధించాలంటూ తాజాగా గడువు విధించింది. అంజుమన్ ఇషాత్–ఇ– తలీమ్ ట్రస్ట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు వేసిన 65కు పైగా రివ్యూ పిటిషన్లను శుక్రవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం కొట్టివేసింది.
ఉచిత నిర్బంధ విద్య చిన్నారుల హక్కు(ఆర్‌టీఈ) చట్టం–2009 అమల్లోకి రాకమునుపు నియమితులైన ఇన్ సర్వీస్ టీచర్లు, రిటైర్మెంట్‌కు ఐదేళ్లకు మించి సర్వీస్ కలిగిన వారు తప్పనిసరిగా రెండేళ్లలోగా టెట్ పాసవ్వాలంటూ 2025లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్ష జరపాలంటూ వీరు కోరారు. విచారణ జరిపిన ధర్మాసనం ఆర్‌టీఈ చట్టం చిన్నారులు తప్పనిసరిగా చదువుకోవాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన చట్టమని, పిల్లల విద్యా భవిష్యత్తును పణంగా పెట్టి ఉపాధ్యాయుల సర్వీసును కొనసాగించలేమని కుండబద్దలు కొట్టింది.
‘అయితే, టెట్ పరీక్షను సంబంధిత అధికారులు త్వరితగతిన నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన సమయం, వనరులు పరిమితంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నందున ఈ కాలపరిమితిని రెండేళ్ల నుంచి మూడేళ్లకు పొడిగిస్తున్నాం. మొదట నిర్దేశించినట్లుగా 2027 ఆగస్టు 31వ తేదీ నాటికి కాకుండా ఈ అర్హత పరీక్షలో 2028 ఆగస్టు 31వ తేదీలోగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని తెలిపింది. ఇదే చివరి అవకాశమని, మరోసారి పొడిగింపు ఉండదని కూడా ఇన్ సర్వీస్ టీచర్లకు స్పష్టం చేసింది. టెట్ పరీక్షలను ఏడాదిలో కనీసం రెండు పర్యాయాలు చేపట్టాలని, అర్హులైన టీచర్లకు అర్హత సాధించేందుకు సహేతుకమైన అవకాశాలను కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను, సంబంధిత యంత్రాంగాలను ధర్మాసనం ఆదేశించింది.


