ఆర్థిక నేరాలకు అడ్డాగా..! | Telangana tops India in economic offences in 2024 | Sakshi
Sakshi News home page

ఆర్థిక నేరాలకు అడ్డాగా..!

May 11 2026 1:36 AM | Updated on May 11 2026 1:36 AM

Telangana tops India in economic offences in 2024

2024లో దేశంలోకెల్లా తెలంగాణలోనే అత్యధిక ఆర్థిక నేరాలు

దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 18.2 శాతం రాష్ట్రంలోనే.. 

జాతీయ నేరాల రేటు 15.3.. 

రాష్ట్రంలో ఏకంగా 102.1 

చార్జిషిట్ల దాఖలులో నత్తనడక.. 39.8 శాతమే దర్యాప్తు పూర్తి 

నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో 2024 నివేదికలో వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఆర్థిక నేరాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన 2024 క్రైం ఇన్‌ ఇండియా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా నమోదైన ఆర్థిక నేరాల కేసుల్లో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. ఒకవైపు కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండగా.. దర్యాప్తు చేసి నేరస్తులపై చార్జిషిట్లు దాఖలు చేయడంలో రాష్ట్ర పోలీసుల పనితీరు జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నట్లు నమోదైంది. 

దేశంలోనే ఫస్ట్‌.. 45.5 శాతం జంప్‌  
ఈ నివేదిక ప్రకారం 2024కుగాను దేశవ్యాప్తంగా 2,14,379 ఆర్థిక నేరాలు నమోదవగా అందులో అత్యధికంగా తెలంగాణలో 39,127 కేసులు నమోదయ్యాయి. అంటే దేశంలోని మొత్తం ఆర్థిక నేరాల్లో 18.2 శాతానికిపైగా కేసులు ఇక్కడే రికార్డయ్యాయి. 2023లో రాష్ట్రంలో 26,881 కేసులు నమోదవగా 2024 నాటికి ఈ సంఖ్య 39,127కు చేరింది. కేవలం ఏడాది వ్యవధిలోనే ఏకంగా 45.5 శాతం మేర కేసులు పెరిగాయి. 

చీటింగ్, ఫోర్జరీ కేసులే అధికం 
రాష్ట్రంలో నమోదైన మొత్తం 39,127 ఆర్థిక నేరాల్లో 38,312 కేసులు ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్‌కు సంబంధించినవే. ఆ తర్వాతి స్థానంలో నేరపూరిత నమ్మకద్రోహం కింద 801 కేసులు, నకిలీ కరెన్సీ కింద 14 కేసులు నమోదయ్యాయి. నేరాల రేటును (లక్ష జనాభాకు నమోదయ్యే కేసులు) పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా ఆర్థిక నేరాల సగటు రేటు లక్ష జనాభాకు 15.3 శాతంగా ఉంటే.. తెలంగాణలో ఇది ఏకంగా 102.1 శాతంగా నమోదైంది. 

మెట్రో నగరాల్లోకెల్లా హైదరాబాద్‌లోనే అధిక కేసులు.. 
దేశంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఆర్థిక నేరాల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరింది. 2024కు సంబంధించి కేవలం హైదరాబాద్‌ మెట్రో నగర పరిధిలోనే ఏకంగా 61,007 కేసులు విచారణ దశలో ఉన్నట్లు పోలీసులు రికార్డులు సమరి్పంచారు. వాటిలో 95 శాతానికిపైగా నకిలీ పత్రాల సృష్టి, రియల్‌ ఎస్టేట్‌ మోసాలు, బ్యాంకింగ్‌ ఫ్రాడ్స్‌కు సంబంధించినవే ఉన్నాయి.

దర్యాప్తులో నత్తనడక.. 
దేశవ్యాప్తంగా ఆర్థిక నేరాలకు సంబంధించి పోలీసులు దాఖలు చేసే చార్జిషిట్‌ రేటు సగటున 53.3 శాతంగా ఉంటే తెలంగాణలో అది కేవలం 39.8 శాతంగానే ఉంది. హైదరాబాద్‌లోనూ పరిస్థితి దాదాపు ఇదే విధంగా ఉంది. దర్యాప్తులో జాప్యం, సరైన ఆధారాలు సేకరించడంలో వెనుకబాటు వల్ల రాష్ట్రంలో చార్జిషీట్ల దాఖలు రేటు తక్కువగా ఉందని.. సకాలంలో శిక్షలు పడకపోవడం వల్లే ఇలాంటి నేరాలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement