చెన్నై: నిన్న (సోమవారం) సాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ మదురై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు చట్టం ముందు నిలబడడానికి కారణం రేవతి అనే ఒక కానిస్టేబుల్ అవునండీ నిజం. బాధితులకు న్యాయం జరగడం కోసం తన సొంత డిపార్ట్‌మెంట్‌ను సైతం ఎదురించి సత్వం వైపు నిలబడడం కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసింది.
సాధారణంగా పోలీస్ స్టేషన్లలో జరిగిన ఏదైనా నేరాలు జరిగితే వాటిని బహిర్గతం చేయడానికి వారు ఆసక్తి చూపరు. అయితే హెడ్‌కానిస్టేబుల్ రేవతి మాత్రం ఇందుకు విభిన్నంగా వ్యవహరించింది. బాధితుల పక్షాన నిలబడడానికి తన సొంత డిపార్ట్‌మెంట్‌నే ఎదురించింది. ఆ రోజు రాత్రి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఘటనను మేజిస్ట్రేట్ ముందు నిర్భయంగా వివరించింది.
బాధితులు జయరాజ్, బెన్నిక్స్‌లను పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఎంతో దారుణంగా హింసించారని మేజిస్ట్రేట్ ముందు ఆమె వివరించింది. పోలీసులు ఆ తండ్రీ కొడుకులను రాత్రంతా తీవ్రంగా కొట్టారని, లాఠీలు మరియు టేబుళ్లపై రక్తపు మరకలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. దీంతో ఆమె సాక్షం ద్వారానే ఆ రక్తపు మరకలున్న వస్తువులను ఫోరెన్సిక్ ఆధారాలుగా సేకరించడం సాధ్యమైంది.
అయితే ఈ సమయంలో తన తోటి పోలీసులు మరియు ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి, భయం ఉన్నప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. వాస్తవానికి, మేజిస్ట్రేట్ విచారణకు వెళ్ళినప్పుడు అక్కడి పోలీసులు సహకరించలేదు, కానీ రేవతి ఇచ్చిన ధైర్యంతోనే విచారణ ముందుకు సాగింది. ఈ నేపథ్యంలోనే తోటి పోలీసుల నుంచే తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేయడంతో, అప్పట్లో ప్రభుత్వం ఆమెకు మరియు ఆమె కుటుంబానికి ప్రత్యేక రక్షణ కల్పించింది.
ఇలాంటి సమయంలో చాలా మంది పోలీసులు సైలెంట్‌గా ఉండటాన్నే సేఫ్‌గా భావిస్తారు. కానీ రేవతి ఆ ఆప్షన్ తీసుకోలేదు ఆమెకి అది కేవలం డ్యూటీ విషయం కాదు… తన కళ్లముందు జరిగిన దారుణానికి స్పందించడమే ప్రథమ కర్తవ్యంగా భావించింది. దీంతో ఎట్టకేలకు నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయడంలో కానిస్టేబుల్ రేవతి ఎంతో కీలకపాత్ర పోషించింది.


