తమిళనాడులో రాష్ట్రపతి పాలన? లేకుంటే.. | Tamil Nadu Episode: Is Governor refers President Rule What Next | Sakshi
Sakshi News home page

తమిళనాడులో రాష్ట్రపతి పాలన? లేకుంటే..

May 8 2026 12:15 PM | Updated on May 8 2026 12:45 PM

Tamil Nadu Episode: Is Governor refers President Rule What Next

దేశం మొత్తం ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తోంది. ఒక అగ్రనటుడు పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పూర్తి బలం లేకున్నా ప్రభుత్వ ఏర్పాట్లకు ప్రయత్నించడం.. మ్యాజిక్‌ ఫిగర్‌ లేదంటూ గవర్నర్‌ అందుకు అనుమతించకపోవడం విమర్శలకూ తావిచ్చింది. ఈ తరుణంలో తమిళనాడులో మే 10 దాటితే ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.

మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో.. విజయ్‌ పార్టీ టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. మేజిక్‌ ఫిగర్‌ 118.. అంటే ప్రభుత్వ ఏర్పాటునకు మరో 10 స్థానాలు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్‌ తన ఐదుగురు ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటించింది. విజయ్‌ రెండు చోట్ల పోటీ చేసి నెగ్గడంతో.. ఇంకో సీటు అదనంగా అవసరం కానుంది. అంటే మరో ఆరుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే సరిపోతుందన్నమాట.

ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఆ తర్వాత బలనిరూపణ చేసుకుంటామని గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌కు విజయ్‌ రెండుసార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో.. ఇలాంటి సందర్భాల్లో గవర్నర్లు సానుకూలంగా వ్యవహరించిన సందర్భాలే అధికంగా ఉన్నాయి. కానీ, తమిళనాడు విషయంలోనే గవర్నర్‌ ఆర్లేకర్‌ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పూర్తి బలం చూపించాకే సీఎంగా ప్రమాణం చేయాలని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని విజయ్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో..

విజయ్‌కు ఇతర పార్టీల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. అదే సమయంలో.. తమిళనాడు 16వ అసెంబ్లీ గడువు ముగియడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈలోపు ప్రభుత్వ ఏర్పాటు అంశం కచ్చితంగా ఓ కొలిక్కి రావాలని లేదు. కాకుంటే గవర్నర్‌ తన విశిష్ట అధికారాల్ని (Discretionary Powers) ఉపయోగించే అవకాశమూ లేకపోలేదు. ఒకటి.. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేదాకా కొనసాగమని కోరడం.. రెండోది టీవీకేను పక్కనపెట్టి ఇతర కూటములను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించడం.. మూడోది రాష్ట్రపతి పాలన విధించే అవకాశం!.

తమిళనాడులో గతంలో నాలుగుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. కరుణానిధి హయాంలో 1976 జనవరి నుంచి 516 రోజులపాటు, ఎంజీఆర్‌ సీఎంగా ఉన్న టైంలో 1980 ఫిబ్రవరి నుంచి 113 రోజులపాటు, 1988లో ఎంజీఆర్‌ మరణాంతరం ఆయన సతీమణి జానకీ సీఎంగా ఉన్నప్పుడు 363 రోజులపాటు, చివరగా..  1991లో కరుణానిధి హయాంలో 145 రోజులపాటు రాష్ట్రపతి పాలన విధించారు.

రాజకీయ విశ్లేషకులు చెబుతోంది ఏంటంటే.. ఇలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి పాలన విధించాలనే కచ్చితమైన రూల్ రాజ్యాంగంలో లేదు. కాకుంటే.. మెజారిటీ నిరూపించలేకపోయినా.. ప్రభుత్వం ఏర్పడకపోయినా "రాజ్యాంగ యంత్రాంగం విఫలమైంది" అని కారణాన్ని చూపిస్తూ కేంద్రానికి గవర్నర్‌ నివేదిక పంపే అవకాశం ఉంది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడవడం లేదని/ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం కొనసాగడం అసాధ్యమని కేంద్రం భావిస్తే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఇప్పుడు తమిళనాడులో ఆ అవకాశం లేకపోలేదు.

సాధారణంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ముందుగా అవకాశం ఇవ్వడం ఒక సంప్రదాయం. అయినప్పటికీ, అది రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉండదు. గవర్నర్ తన నిర్ణయాన్ని మెజారిటీ నిరూపణ ఆధారంగా తీసుకునే సందర్భాలు ఉన్నాయి. అయితే తాజా తమిళనాడు ఎపిసోడ్‌ నేపథ్యంలో.. గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు అప్పుడు గవర్నర్లు రాష్ట్రపతి పాలనకు సిఫార్సులు చేసిన సందర్భాలు ఉన్నాయి.

1996లో ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 174 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ టైంలో మేజిక్‌ ఫిగర్‌ 213. బీజేపీకి అది సాధ్యం కాలేదు. ఏ కూటమి కూడా మెజారిటీ సాధించలేకపోవడంతో అప్పటి గవర్నర్‌ రాష్ట్రపతి పాలన కొనసాగించారు(ఎస్పీ-బీఎస్పీ కూటమి కూలిపోవడంతో 1995లోనే గవర్నర్‌ మోతీలాల్‌ వోరా రాష్ట్రపతి పాలన విధించారు). ఆ తర్వాత ఏడాదికి బీజేపీ-బీఎస్పీ కూటమి ఏర్పడి మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కేసు.. ఇక్కడ ఒక పార్టీ అత్యధిక సీట్లు గెలుపొందడం ముఖ్యం కాదు అని చెప్పింది. 

ఇక.. 2005 బీహార్‌ ఎన్నికల్లోనూ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. అయితే ఒకవైపు కూటమి ప్రయత్నాలు జరుగుతుండగానే అప్పటి గవర్నర్‌ బూటా సింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొదటి సమావేశం జరగకముందే ఆ అసెంబ్లీని రద్దు చేసి.. ‘‘హార్స్ ట్రేడింగ్ జరుగుతోంది’’ అని కేంద్రానికి నివేదిక పంపి రాష్ట్రపతి పాలన విధించారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరడం.. గవర్నర్‌ వ్యవహరించిన తీరును సర్వో‍న్నత న్యాయస్థానం తప్పుబట్టడం.. అది రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయమని.. గవర్నర్‌ అధికారాలను పరిమితం చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగాయి. అయితే అప్పటికే ఎన్నికల తేదీలు ప్రకటించడంతో కోర్టు ఈ వ్యవహారంలో జోక్యం ఇక్కడికే పరిమితం చేసింది.

విజయ్‌ పార్టీ (TVK) అత్యధిక స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కానీ మెజారిటీకి కావలసిన 118 సీట్లు దాటలేకపోవడంతో గవర్నర్ మద్దతు లేఖలు కోరుతున్నారు. ఆయన అడిగిన దాంట్లో తప్పుందని కూడా అనలేం.  2006లో డీఎంకేకు 96 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ, మిత్రపక్షాల మద్దతు లేఖలతో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకొచ్చింది. మెజారిటీ ఉండడంతో గవర్నర్‌ అందుకు అనుమతించారు. ఆ తర్వాత బలనిరూపణలో ప్రభుత్వం నెగ్గింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన ఒక అత్యవసర పరిస్థితిలో మాత్రమే అమలు చేసే చర్య. ప్రస్తుత తమిళనాడు విషయంలో గవర్నర్‌ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే వివాదాలకు దారి తీసే అవకాశం కూడా. గవర్నర్ నివేదికలు, ఆర్టికల్‌ 356 వినియోగం.. కోర్టు సమీక్షకు లోబడి ఉండాలని గతంలో న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. అలాగే ఎన్నికల ద్వారా వచ్చిన అసెంబ్లీని రద్దు చేయడం అత్యంత అసాధారణం కూడా. ఒకవేళ.. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌వీ ఆర్లేకర్‌ గనుక ఏదైనా అసాధారణ నిర్ణయం తీసుకుంటే టీవీకే పార్టీ సుప్రీం కోర్టు తలుపు తట్టే అవకాశం లేకపోలేదు.

Advertisement
 
Advertisement
Advertisement