పదేళ్ల తర్వాత డీఎంకే.. సభా పర్వానికి సర్వం సిద్ధం

Tamil Nadu Assembly Session To Begin Today - Sakshi

గవర్నర్‌ ప్రసంగంతో నేడు శ్రీకారం

పదేళ్ల తర్వాత మారిన అన్నాడీఎంకే సీట్లు

అందరికీ కరోనా పరీక్షలు 

అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. పదేళ్లుగా అధికార పక్షంలో కూర్చున్న అన్నాడీఎంకే సభ్యులు తాజాగా ప్రతిపక్ష సీట్లలో కూర్చోనున్నారు.  

సాక్షి, చెన్నై: డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కరోనా నివారణ చర్యల మీద ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. సీఎం స్టాలిన్‌ నేతృత్వంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పడ్డ శ్రమకు ఫలితంగా అనేక జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ తొలి సమావేశాల నిర్వహణ అనివార్యం కావడంతో అందుకు తగిన చర్యలు చేపట్టారు. గవర్నర్‌ భన్వారీలాల్‌ పురోహిత్‌ సమావేశాలను ఆమోదించారు. 

గవర్నర్‌ ప్రసంగంతో.... 
ఈ ఏడాది గత ప్రభుత్వ హయాంలో తొలి సమావేశంలో గవర్నర్‌ ప్రసంగం సాగిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దృష్ట్యా రెండో సారి సభలో గవర్నర్‌ ప్రసంగం సాగనుంది. సోమవారం ఉదయం పది గంటలకు కలైవానర్‌ అరంగం వేదికగా సభ ప్రారంభం కానుంది. స్పీకర్‌గా అప్పావు సభను నడిపించనున్నారు. గవర్నర్‌ ప్రసంగంలో కరోనా కట్టడిలో అందరి పాత్ర, ప్రశంసలు, రాష్ట్ర ఆర్థిక ప్రగతి బలోపేతానికి తగిన ప్రణాళిక, చెన్నైలో మల్టీసూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంతో పాటు మరికొన్ని కొత్త నిర్మాణాలు, డీఎంకే ఎన్నికల వాగ్దానాల అమలుకు సంబంధించిన పలు అంశాలు ఉండనున్నా యి. అనంతరం సభా వ్యవహారాల కమిటీ సమావే శం అవుతుంది. ఇందులో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, చర్చించాల్సిన అంశాలు, కీలక తీర్మానాల గురించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో సేలం గ్రీన్‌ వే, నీట్‌కు వ్యతిరేకంగా, రాజీవ్‌ హంతులకు దీర్ఘకాలిక పెరోల్‌ తదితర అంశాలకు సంబంధించిన తీర్మానాలు ఉండనున్నాయి.

నెగిటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలి 
సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ కరోనా నెగిటివ్‌ సరి్టఫికెట్‌ తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు చేశారు. అలాగే సభ జరిగే కలైవానర్‌ అరంగం పరిసరాల్లో భద్రతను పెంచారు. సెయింట్‌ జార్జ్‌ కోటలోని అసెంబ్లీ సమావేశ మందిరాన్ని తలపించే విధంగా కలైవానర్‌ అరంగంలోనూ ఏర్పాట్లు చేశారు. గత పదేళ్లుగా అధికార పక్షంలో ఉన్న అన్నాడీఎంకే సభ్యులు తాజాగా ప్రతిపక్ష వరుసలో కూర్చోవాల్సిన పరిస్థితి. 

చదవండి: తమిళనాడులో మరో వారం లాక్‌డౌన్‌ పొడిగింపు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top