
గాలి కాలుష్యాన్ని అడ్డుకోవడంలో టాప్
దక్కిన జాతీయ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డులు
మొదటి కేటగిరీలో జబల్‌పూర్, ఆగ్రా, సూరత్‌లకు చోటు
విజేతల జాబితాలో కనిపించని ఏపీ, తెలంగాణ నగరాలు
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, మహారాష్ట్రలోని అమరావతి, మధ్యప్రదేశ్‌లోని దేవాస్.. దేశంలోనే నాణ్యమైన గాలి కలిగిన నగరాలుగా నిలిచాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ ప్రకటించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డులను గెలుచుకున్నాయి. ఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి భూపేందర్ యాదవ్ అవార్డులను ప్రదానం చేశారు. పారిశ్రామిక కేంద్రాలు, బొగ్గు గనుల వంటివి ఉన్నప్పటికీ ఇవి మంచి ఫలితాలను సాధించాయన్నారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్‌సీఏపీ) కింద దేశంలోని 130 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు చేపట్టిన చర్యల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు.
నగర జనాభాను బట్టి మూడు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు. కేటగిరీ–1 (10 లక్షలకు పైగా జనాభా)లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ రూ.1.5 కోట్ల నగదు బహుమతితో మొదటి స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్‌కే చెందిన జబల్‌పూర్ రూ.1 కోటితో ఈ కేటగిరీలో రెండో స్థానం, యూపీలోని ఆగ్రా, గుజరాత్‌లోని సూరత్ చెరో రూ.25 లక్షలతో మూడో స్థానంలో నిలిచాయి. కేటగిరీ–2 (3– 10 లక్షల జనాభా)లో మహారాష్ట్రలోని అమరావతి రూ.75 లక్షలతో మొదటి స్థానం దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ, మొరాదాబాద్‌లు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. కేటగిరీ–3 (3 లక్షల లోపు జనాభా)లో దేవాస్ (మధ్యప్రదేశ్) రూ.37.50 లక్షలతో ప్రథమ స్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీ 32వ స్థానంలో నిలవడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?
జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్‌సీఏపీ) కింద ఎంపిక చేసిన 130 నగరాల జాబితాలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి తెలుగు రాష్ట్రాలకు చెందిన నగరాలు కూడా ఉన్నాయి. ఈ నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోంది. ఇప్పటివరకు 130 నగరాలకు రూ.20,130 కోట్లు కేటాయించగా, వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా సుమారు రూ.1.55 లక్షల కోట్లను సమీకరించారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు అందుతున్నా, తెలుగు నగరాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంలో వెనుకబడటం గమనార్హం.
వార్డు స్థాయికి విస్తరిస్తాం
రామ్‌సర్ కన్వెన్షన్ విభాగం కింద ఇండోర్, ఉదయ్‌పూర్ నగరాలకు ‘వెట్‌ల్యాండ్ సిటీ అక్రిడిటేషన్’(చిత్తడి నేలల నగర గుర్తింపు) సరి్టఫికెట్లను మంత్రి భూపేందర్ యాదవ్ అందజేశారు. పట్టణ చిత్తడి నేలల పరిరక్షణకు ఈ నగరాలు అసాధారణమైన చర్యలు తీసుకున్నాయని కొనియాడారు. దేశంలోని 103 నగరాల్లో గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి వార్డుల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు తీసుకున్న చర్యల ఆధారంగానూ అవార్డులు అందజేస్తామని తెలిపారు. తద్వారా క్షేత్రస్థాయిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశముందని తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు.