
గ్రూప్–1 అభ్యర్థులకు సుప్రీంకోర్టు హెచ్చరిక
మళ్లీ మళ్లీ ఎందుకు వస్తారంటూ సీరియస్
పిటిషన్ విత్‌డ్రా చేసుకున్న అభ్యర్థులు
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీ ఇష్టం వచ్చినట్లు ఒకే విషయంపై పదే పదే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుంది జాగ్రత్త..’అని గ్రూప్–1 అభ్యర్థులను సుప్రీంకోర్టు హెచ్చరించింది. ‘ఈ విషయమై గతంలోనూ కొందరు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు అయ్యాక దీనిపై వాదనలు అవసరమా అని అప్పుడే మేం ప్రశ్నించాం. ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేశాం. ఇప్పుడు మళ్లీ మీరెందుకు వచ్చారు? మేం డిస్మిస్ చేసిన విషయం మీకు తెలియదా?’అంటూ నిలదీసింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. అభ్యర్థులు పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు, ఆ పిటిషన్ విత్‌డ్రాకు ధర్మాసనం అనుమతి ఇచి్చంది.
గ్రూప్–1,2,3 నోటిఫికేషన్లకు సంబంధించిన జీవో 29, జీవో 33ను, పీహెచ్‌సీ రిజర్వేషన్లు వర్టీకల్‌గా అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ కుమ్మరి ప్రవీణ, మరో 12 మంది 370 పేజీలతో కూడిన రిట్ పిటిషన్‌ను ఏప్రిల్ 30న సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జోమాల్య బగి్చలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎస్.నిరంజన్ రెడ్డి, పిటిషనర్ల తరపున రానా ముఖర్జీ వాదనలు వినిపించారు.
గ్రూప్–1 నోటిఫికేషన్ వ్యవహారంలో జీవో 29 రద్దు అంశంపై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ జరిపి, కొట్టివేసిందని నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అభ్యర్థులపై సీరియస్ అయ్యింది. ‘పిటిషన్‌లో కొత్తగా ఏం ఉంది? ఒకే అంశంపై ఇంతమంది ఇన్నిసార్లు ఎందుకు? ఇలా చేస్తే జరిమానా విధిస్తాం..’అని హెచ్చరించింది. దీంతో పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రానా ముఖర్జీ అభ్యర్థించగా ధర్మాసనం అంగీకరించింది.