
న్యూఢిల్లీ: ఒక రాష్ట్రంలో రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న వ్యక్తి సదరు రాష్ట్రం విభజనైతే ఏర్పడే రాష్ట్రాల్లో వేటిలోనైనా అదేవిధమైన రిజర్వేషన్‌కు అర్హుడని, కానీ ఏర్పడిన అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ పొందడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. బిహార్ విభజన అనంతరం ఏర్పడిన బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించి కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. జార్ఖండ్‌కు చెందిన పంకజ్ కుమార్ ఎస్‌సీ వర్గానికి చెందినవారు. ఆయన 2007 రాష్ట్ర సివిల్ సర్వీసు పరీక్షల్లో నెగ్గారు. అయితే ఆయన అడ్రస్ ప్రూఫ్ పట్నాలో ఉంది.
రాష్ట్ర విభజన అనంతరం ఆయన జార్ఖండ్‌లో రాష్ట్ర సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశారు. కానీ ఆయన ప్రూఫ్ పట్నాలో ఉన్నందున రిజర్వేషన్ వర్తించదని ప్రభుత్వం తిరస్కరించింది. ప్రభుత్వ తీరుపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా, వ్యతిరేకంగానే తీర్పువచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.దీనిపై విచారణ జరిపిన కోర్టు, సదరు పిటీషనర్ అటు బిహార్‌లోకానీ, ఇటు జార్ఖండ్‌లో కానీ రిజర్వేషన్ పొందవచ్చని, కానీ ఒకేసారి రెండు రాష్ట్రాల్లో రిజర్వేషన్‌కు అర్హుడు కాడని తీర్పునిచ్చింది.
ఒక రాష్ట్రంలో ఉంటూ మరో రాష్ట్రంలో పరీక్ష రాసిన అభ్యర్ధి ఎవరైనా ఓపెన్ క్యాటగిరీలో రాసినట్లేనని పేర్కొంది. అయితే పంకజ్ కేసులో ఆయన రాష్ట్ర విభజనకు పూర్వమే రిజర్వేషన్ కోటాలో టీచర్ ఉద్యోగం పొంది జార్ఖండ్ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నట్లు కోర్టు గుర్తించింది. అందువల్ల విభజన చట్టం ప్రకారం ఆయన కొత్తగా ఏర్పడిన ఝార్ఖండ్‌లో సైతం రిజర్వేషన్ కేటగిరీలోకే వస్తాడని పేర్కొంది. ఆయన తండ్రి నివాసం పట్నాలో ఉన్నప్పటికీ, విభజన సమయంలో జార్ఖండ్‌ను ఎంచుకున్నందున ఆయన రిజర్వేషన్ కొనసాగుతుందని అభిప్రాయపడుతూ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. పంకజ్‌ను 6 వారాల్లో ఉద్యోగంలో నియమించాలని, ఇతర వసతులు వర్తింప జేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.