
ఢిల్లీ: పలు సంచలన తీర్పులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న అలహాబాద్ (ఉత్తర ప్రదేశ్)హైకోర్టుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరహా తీర్పులతో సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించింది. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
మార్చి 17వ తేదీన ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచార యత్నం కేసు విచారణలో జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన తీర్పు వెల్లడించారు. వక్షోజాలను తాకడం.. యువతి పైజామాను లాగడం లాంటి చేష్టలు అత్యాచార యత్నం కిందకు రాదని పేర్కొంటూనే.. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశించారు. అయితే ఈ తీర్పును సుమోటోగా స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పును, న్యాయమూర్తి తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్టే విధించింది.
మైనర్ బాలిక కేసు విచారణపై తీర్పు ఇచ్చిన తర్వాత.. ఇదే తరహా మరో కేసులో.. మరో కీలక తీర్పును వెలువరించింది. అత్యాచార ఘటనలో యువతిది స్వయంకృతాపరాధమేనని వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలపై మంగళవారం సుప్రీం కోర్టు స్పందించింది.
అలహాబాద్ హైకోర్టు తీర్పుపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసిహ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. తీర్పులో భాగంగా బెయిల్ ఇవ్వొచ్చు. కానీ కోర్టు ఇలా వ్యాఖ్యానించవచ్చా?.అని ప్రశ్నించింది. తీర్పులు ఇచ్చే సమయంలో జడ్జీలు చేసే వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ కేసును పరిష్కరించేటప్పుడు మేము మరిన్ని కేసులను కూడా పరిశీలిస్తాం’ అని జస్టిస్ గవాయి అన్నారు.
ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ..‘న్యాయం చేయడమే కాదు, దాని గురించి అందరూ మాట్లాడకునేలా ఉండాలి’ అని అన్నారు. అలహాబాద్ కోర్టు చేసిన ఇలాంటి వ్యాఖ్యలు సామాన్యుడి దృష్టిలో ఎలా అనిపించవచ్చు అన్న విషయాన్ని జడ్జీలకు గుర్తు చేయాలని ఆయన సూచించారు. తీర్పును నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
అసలేం జరిగిందంటే?
గతేడాది ఢిల్లీలో పీజీ విద్యార్థినిపై ఆమె క్లాస్‌మెట్ అత్యాచారం చేసినట్లు ఓ యువతి కేసు పెట్టింది. మద్యం మత్తులో ఉన్న తనని నిందితుడు రెండు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. అయితే, బాధితురాలిపై జరిగింది అత్యాచారం కాదని, పరస్పర అంగీకారంతో ఇద్దరు కలిసినట్లు నిందితుడి తరుఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిందితుడికి జైలు శిక్షను విధించింది. నిందితుడు నాటి నుంచి జైల్లో జీవితం అనుభవిస్తున్నారు.
ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!
తాజాగా, ఈ కేసు నిందితుడు అలహాబాద్‌లో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితురాలుగా ఉన్న యువతి ఎంఏ చదువుతోంది. ఏది తప్పో..ఏది ఒప్పో.. నైతికత గురించి ఆమెకు తెలియంది కాదు. ఒకవేళ బాధితురాలి ఆరోపణే నిజం అనుకున్నా.. ఇక్కడ సమస్యను స్వయంగా ఆమెనే ఆహ్వానించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, జరిగిన దానికి ఆమె కూడా ఓ బాధ్యురాలే. ఇది ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!.
స్పందించిన సుప్రీం కోర్టు
పైగా వైద్య పరీక్షలో కన్నెపొర(Hymen) చిరిగిపోయినట్లు తేలింది. కానీ లైంగిక వేధింపులు జరిగినట్లుగా వైద్యులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఇక ఈ కేసులో నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. బెయిల్ షరతులను ఉల్లంఘించడని హామీతో పాటు, సాక్ష్యాలను ప్రభావితం చేయలేడన్న నమ్మకం కుదిరిన తర్వాతే నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నాం అని జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఆదేశాలపై సుప్రీం కోర్టు స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించింది.