యూపీఎస్సీని చూసి నేర్చుకోండి  | Supreme Court Pulls Up NTA Over NEET-UG 2026 Paper Leak | Sakshi
Sakshi News home page

యూపీఎస్సీని చూసి నేర్చుకోండి 

May 30 2026 1:04 AM | Updated on May 30 2026 1:04 AM

Supreme Court Pulls Up NTA Over NEET-UG 2026 Paper Leak

ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు ధర్మాసనం హితవు  

‘నీట్‌’లీకేజీ విద్యార్థులకు, వారి కుటుంబాలకు తీరని వేదన  

జవాబుదారీతనం లేకపోతే సమస్య పరిష్కారం కాదు  

సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం  

సాక్షి, న్యూఢిల్లీ:  మన యువతను ఎప్పుడూ నిరాశపర్చకూడదని సుప్రీంకోర్టు సూచించింది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్‌)–యూజీలో అక్రమాలపై ఆగ్రహం వ్యక్తంచేసింది. నిజమైన జవాబుదారీతనం ఏర్పడే వరకు ఈ వైద్య ప్రవేశ పరీక్షకు సంబంధించిన అసలు సమస్య పరిష్కారం కాదని వెల్లడించింది. నీట్‌ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు పదేపదే పునరావృతం కావడం వ్యవస్థాగత వైఫల్యమేనని స్పష్టం చేసింది. 

పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(యూపీఎస్సీ) పరీక్షల విధానం గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించింది. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో పేపర్‌ లీక్‌ వంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదని గుర్తుచేసింది. యూపీఎస్సీ నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఎన్‌టీఏకు హితవు పలికింది. 

నీట్‌(యూజీ)లో అవకతవకల నేపథ్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ని రద్దు చేసేలా లేదా ఆ సంస్థను పునర్వ్యవస్థీకరించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ అలోక్‌ అరాధేతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. నీట్‌ అభ్యర్థుల ఆందోళనల పరిష్కారం పట్ల ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తోందని చెప్పారు. 

ప్రవేశ పరీక్షలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. జూన్‌ 21న జరగనున్న నీట్‌–యూజీ రీటెస్ట్‌ కోసం కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. పరీక్షలో అక్రమాలు జరిగితే విద్యార్థులకే కాకుండా వారి కుటుంబాలకు కూడా అది చాలా బాధాకరమైన విషయం అవుతుందని పేర్కొంది. వారు చాలా భావోద్వేగానికి గురవుతారని తెలిపింది. బాధ్యత ఎవరి భుజస్కంధాలపై ఉందో తెలిసినప్పుడే జవాబుదారీతనం ప్రభావవంతంగా ఉంటుందని స్పష్టంచేసింది.  

వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం: తుషార్‌ మెహతా  
పరీక్షల్లో అక్రమాలు జరగకుండా ఎక్కడో ఒకచోట ముగింపు పలకాల్సిందేనని తుషార్‌ మెహతా అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని గుర్తుచేశారు. ప్రధానమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని, పరిస్థితిని సమీక్షిస్తున్నారని వెల్లడించారు. 

నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు భవిష్యత్తులో ఎన్‌టీఏ పరీక్షల్లో పెన్‌ అండ్‌ పేపర్‌ విధానానికి బదులు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) విధానాన్ని అమలు చేయడంతో పాటు, సైబర్‌ భద్రతను పెంచుతున్నామని తెలిపారు.

 ఐఐటీ తదితర సంస్థల నుంచి నిపుణులను భాగస్వాములను చేసి వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నట్లు తుషార్‌ మెహతా వివరించారు. చాలా సంస్థలు తాత్కాలికమైనవి కావడమే అసలు సమస్య అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒక సంస్థలో అత్యుత్తమంగా పనిచేసే అధికారిపైనే అందరూ ఆధారపడతారని పేర్కొంది. దేశమంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. సామర్థ్యం అనేది సంస్థకు ఉండాలని సూచించింది. అందుకే సంస్థను గొప్పగా పనిచేసేలా తీర్చిదిద్దాలని ఉద్ఘాటించింది.  

సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయండి  
తాము మే 25వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుకు అనుగుణంగా ఎన్‌టీఏ డైరెక్టర్‌ (లీగల్‌) ఒక అఫిడవిట్‌ దాఖలు చేశారని ధర్మాసనం పేర్కొంది. అఫిడవిట్‌ను క్షుణ్నంగా పరిశీలిస్తామని తెలియజేసింది. ఎన్‌టీఏలో సంస్కరణల కోసం ‘ఇస్రో’మాజీ చైర్మన్‌ డాక్టర్‌ కె.రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చేసిన సిఫార్సుల అమలు, భవిష్యత్‌ కార్యాచరణను సూచిస్తూ కె.రాధాకృష్ణన్‌ కూడా ఒక అఫిడవిట్‌ దాఖలు చేశారని ధర్మాసనం వెల్లడించింది.

 ప్రతి సంవత్సరం పరీక్ష నిర్వహణ, ముగింపు ప్రక్రియను ఏవిధంగా పూర్తిచేస్తారో తెలియజేస్తూ సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2024 లేదా 2026 పరీక్షల వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు, ఎన్‌టీఏకే భౌతికంగా, మేధోపరంగా అవసరమైన వనరులు అందుబాటులో ఉండాలన్నదే తమ ఉద్దేశమని ధర్మాసనం స్పష్టంచేసింది. ఆరు వారాల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రానికి సూచించింది. తదుపరి విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది.  

అలాగైతే సిఫార్సుల్లోనే లోపం
సుప్రీంకోర్టులో విచారణకు డాక్టర్‌ కె.రాధాకృష్ణన్‌ కూడా హాజరయ్యారు. స్టీరింగ్‌ కమిటీ సిఫార్సుల అమలును ఎంతవరకు పర్యవేక్షించారని ధర్మాసనం ఆయనను ప్రశ్నించింది. నీట్‌(యూజీ)లో వైఫల్యం ఎలా జరిగిందో చెప్పాలని సూచించింది. ఒకవేళ కమిటీ సిఫార్సు ఆధారంగా పర్యవేక్షణ జరిగినప్పటికీ, ఈ వైఫల్యం జరిగి ఉంటే.. అసలు సిఫార్సుల్లో లోపం ఉన్నట్లేనని అభిప్రాయపడింది. భవిష్యత్తులో తలెత్తబోయే పరిస్థితులను కమిటీ ఊహించలేకపోయినట్లే అవుతుందని తెలిపింది. రాధాకృష్ణన్‌ బదులిస్తూ.. ఇప్పటికే చాలా సిఫార్సులను అమలు చేయడం ప్రారంభమైందని అన్నారు. 2025లో నీట్‌(యూజీ)ని సంతృప్తికరంగా నిర్వహించినట్లు తెలిపారు. కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఒకటి రెండుసార్లు విద్యుత్‌ అంతరాయం మినహా ఎలాంటి తప్పిదాలు జరగలేదన్నారు.

2027 నుంచి సీబీటీ విధానం  
నీట్‌(యూజీ) పరీక్షలో సమగ్ర మార్పులు తీసుకొస్తున్నామని ఎన్‌టీఏ తెలియజేసింది. వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) నిర్వహించబోతున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. నీట్‌–యూజీని సీబీటీ విధానానికి మార్చాలని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిపింది. కేవలం ఈ ఏడాది మాత్రమే నీట్‌(యూజీ) ప్రధాన పరీక్షను పెన్, పేపర్‌(పీపీటీ) విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. మిగతా అన్ని ప్రధాన ఎన్‌టీఏ పరీక్షలను ఇప్పటికే సీబీటీ విధానంలో నిర్వహిస్తున్నట్లు గుర్తుచేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement