ప్రైవేట్‌ వీడియోలు లీక్‌ చేస్తామంటే జైలుకే: సుప్రీంకోర్టు | Supreme Court Key Comments On Women Privacy In Tamil Nadu Case | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ వీడియోలు లీక్‌ చేస్తామంటే జైలుకే: సుప్రీంకోర్టు

May 24 2026 7:05 AM | Updated on May 24 2026 11:11 AM

Supreme Court Key Comments On Women Privacy In Tamil Nadu Case

సాక్షి, న్యూఢిల్లీ: మహిళల ప్రైవేట్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామని బెదిరించడం తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేరాన్ని నిరూపించడానికి నిందితుడి వద్ద మొబైల్‌ ఫోన్, సంబంధిత వీడియో లభించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ప్రైవేట్‌ వీడియోను నెట్‌లో పెడతానన్న బెదిరింపు ఒక్కటే అతడిని దోషిగా నిర్ధారించడానికి సరిపోతుందని పేర్కొంది. పెళ్లి చేసుకోవాలని నిలదీసినందుకు ఆ మహిళ స్నానం చేస్తుండగా వీడియోను ఫేస్‌బుక్‌లో పెడతానని బెదిరించిన వ్యక్తికి దిగువ కోర్టు విధించిన శిక్షను జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ ఎన్‌.కె.సింగ్‌ల ధర్మాసనం సమర్థిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించింది.

ప్రేమించి.. ఆపై బెదిరించి..
తమిళనాడుకు చెందిన ఓ మహిళ విజయ్‌ కుమార్‌ అనే వ్యక్తితో కొన్నాళ్లు సన్నిహితంగా మెలిగారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన విజయ్‌ కుమార్‌ ఆ తర్వాత నిరాకరించడంతో ఆమె నిలదీసింది. ఆమె స్నానం చేస్తుండగా రహస్యంగా తీసిన వీడియో తన వద్ద ఉందని, దాన్ని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించాడు. బాధితురాలు 2015లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు పరస్పర అంగీకారంతోనే కలిసున్నారని నిర్ధారిస్తూ అత్యాచారం, మోసం కేసులను కొట్టివేసింది.

కానీ, బెదిరింపులకు పాల్పడినందుకు ఐపీసీ సెక్షన్‌ 506 (పార్ట్‌–2) కింద శిక్ష విధించింది. మద్రాస్‌ హైకోర్టు సైతం ఈ తీర్పును సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అత్యాచారం వంటి ప్రధాన ఆరోపణలు వీగిపోయినప్పుడు, కేవలం బెదిరింపు కేసు కింద శిక్ష విధించడం చెల్లదని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు. దర్యాప్తులో పోలీసులకు నిందితుడి వద్ద ఎలాంటి మొబైల్‌ ఫోన్, వీడియో లభించలేదని, ఆధారాలు లేనప్పుడు శిక్ష ఎలా వేస్తారని ప్రశ్నించారు.

ఆ విషయంలో జోక్యం తగదు..
నేరపూరిత బెదిరింపు ప్రత్యేక నేరమని, ఇతర కేసుల తీర్పులతో దానికి సంబంధం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘నేరాన్ని నిరూపించడానికి వస్తువు (వీడియో/ఫోన్‌) దొరకడమే ప్రామాణికం కాదు. ప్రైవేట్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించడం మహిళను తీవ్ర భయాందోళనలకు గురిచేసే అంశం’ అని వ్యాఖ్యానించింది. డిజిటల్‌ యుగంలో మహిళల గౌరవాన్ని, ప్రైవసీని పాతకాలపు నైతిక విలువల ఆధారంగా చూడలేమని అభిప్రాయపడింది. వ్యక్తిగత విషయాలను ఎంతవరకు గోప్యంగా ఉంచుకోవాలనేది మహిళ హక్కు అని, ఆ స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడం ఆమె మర్యాదను దెబ్బతీయడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్‌ 506 కింద నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ కింది కోర్టులిచ్చిన తీర్పును సమర్థించింది. నేరం రుజువైనప్పటికీ ఈ కేసు 2015 నాటిది కావడంతో నిందితుడు ఇప్పటికే జైలులో గడిపిన కాలాన్ని శిక్షగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement