మిస్సింగ్‌ కేసుల్లో తక్షణమే ఎఫ్‌ఐఆర్‌  | Supreme Court of India Issues Directions To Combat Child Trafficking | Sakshi
Sakshi News home page

మిస్సింగ్‌ కేసుల్లో తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ 

May 23 2026 4:07 AM | Updated on May 23 2026 4:07 AM

Supreme Court of India Issues Directions To Combat Child Trafficking

ప్రాథమిక విచారణ పేరుతో జాప్యం తగదు 

దేశంలోని పోలీస్‌స్టేషన్ల అనుసంధానానికి పోర్టల్‌ 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చిన్నారులు, మహిళల అక్రమ రవాణా కేసులు పెరిగిపోతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎవరైనా తప్పిపోయినట్లు సమాచారం అందిన వెంటనే ప్రాథమిక విచారణ పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, పోలీసు యంత్రాంగానికి కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. 

చిన్నారుల అక్రమ రవాణాపై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ అహసానుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ముక్తా గుప్తా, కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.డి.సంజయ్‌ వాదనలు వినిపించారు. సమస్య ఇంత తీవ్రమైందన్న విషయం తనకు తెలియదంటూ జస్టిస్‌ అమానుల్లా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై తనకు ఇంతవరకూ అవగాహన లేదనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పటి వరకు 47 వేల మంది చిన్నారులు జాడ తెలియకుండా పోవడాన్ని ప్రస్తావిస్తూ..ఈ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండటంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బాలలు వ్యవస్థీకృత అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠాల బారినపడుతున్నారని పేర్కొంది. 

ఏహెచ్‌టీయూలకు కేసుల బదిలీ
దర్యాప్తులో అక్రమ రవాణా జరిగినట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణమే ఆ కేసును మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలకు (ఏహెచ్‌టీయూ) బదిలీ చేయాలి. కాగితాలకే పరిమితమైన ఏహెచ్‌టీయూలను వెంటనే క్రియాశీలకంగా మార్చాలి. చట్టపరమైన చర్యలు తీసుకునేలా వాటికి తగిన అధికారాలు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు స్పష్టం చేసింది. రక్షించిన చిన్నారులను విచారణ అనంతరం ఎలాంటి జాప్యం లేకుండా కుటుంబ సభ్యులకు అప్పగించాలి. అక్రమ రవాణాలో కుటుంబ సభ్యుల పాత్రే ఉన్నట్లు తేలితే బాధితులను వారికి అప్పగించకూడదు. 

ఆధార్‌ నమోదు తప్పనిసరి 
బాధితులను రక్షించిన వెంటనే వారిని ఆధార్‌ వెరిఫికేషన్‌ లేదా కొత్త ఆధార్‌ కార్డు నమోదు కోసం తీసుకెళ్లాలి. బయోమెట్రిక్‌ ఆధారాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో అదే వ్యక్తి మరో ఆధార్‌ కార్డు పొందే ప్రయత్నం చేస్తే సులభంగా గుర్తించేందుకు వీలుంటుంది. బాధితులను రక్షించిన ప్రాంతాల్లోని జిల్లా బాలల పరిరక్షణ విభాగాలు (డీసీపీయూ) బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఈ ప్రక్రియను హైకోర్టు బాలల న్యాయ కమిటీలు పర్యవేక్షించాలి. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలు పూర్తి సహకారం అందించాలి. ప్రత్యేక పోర్టల్‌ను ‘మిషన్‌ వాత్సల్య’, ‘సీసీటీఎన్‌ఎస్‌’తో అనుసంధానం చేయాలన్న సూచనను పరిగణనలోకి తీసుకుంటున్నామంది.

ధర్మాసనం ఏం చెప్పిందంటే.. 
→ అదృశ్యమైన మహిళలు, చిన్నారుల కేసుల కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను తీసుకురావాలి. దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్‌స్టేషన్లను ఒకే వేదికపైకి తెస్తూ జాతీయ స్థాయి గ్రిడ్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖను ఆదేశించింది. 

→ ఎవరైనా తప్పిపోయినట్లు సమాచారం అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. ప్రాథమిక విచారణ జరిపే వరకు లేదా కుటుంబ సభ్యులు వచ్చే వరకు వేచి చూడొద్దు. 

→ ఎఫ్‌ఐఆర్‌లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని కిడ్నాప్, అక్రమ రవాణా సెక్షన్లను తప్పనిసరిగా చేర్చాలి. 

→ తప్పిపోయిన వ్యక్తి 24 గంటల్లోపు తిరిగి వస్తే కేసును అక్కడే మూసివేయవచ్చు. కానీ, 24 గంటల వరకు వేచిచూడకుండా ఆచూకీ కోసం తక్షణమే అత్యున్నత స్థాయిలో దర్యాప్తు వేగవంతం చేయాలి.

నోడల్‌ అధికారుల తీరుపై అసంతృప్తి  
నోడల్‌ అధికారుల నియామకం, వారి పనితీరుపై ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారులను తరచూ మార్చడం, సమావేశాలకు హాజరుకాకుండా తమ తరఫున ఇతరులను పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులపై అవగాహన, నిజాయతీ, సామర్థ్యం ఉన్న అధికారులనే నియమించాలని అన్ని రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులు, డీజీపీలను ఆదేశించింది. ఏహెచ్‌టీయూలకు సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర నోడల్‌ అధికారులకు ఉంటుందని, ఆ బాధ్యతలను వేరొకరికి బదిలీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్‌కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.  

Advertisement
 
Advertisement
Advertisement